Download App

సంయుక్త సైనిక కమాండ్ వ్యవస్థ దిశగా భారత్ అడుగులు…

మే 15, 2026 By Suresh Thota
భారత రక్షణ రంగ వ్యవస్థలో స్వాతంత్ర్యం తర్వాత అత్యంత కీలకమైన మార్పులలో ఒకటిగా భావిస్తున్న "సంయుక్త సైనిక కమాండ్ వ్యవస్థ" ఇప్పుడు అమలు దశకు చేరుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చర్చలకే పరిమితమైన ఈ వ్యవస్థపై ఇప్పుడు దేశ అత్యున్నత రక్షణ రంగ నాయకత్వం బహిరంగంగా మాట్లాడటం...
సంయుక్త సైనిక కమాండ్ వ్యవస్థ దిశగా భారత్ అడుగులు….

భారత రక్షణ రంగ వ్యవస్థలో స్వాతంత్ర్యం తర్వాత అత్యంత కీలకమైన మార్పులలో ఒకటిగా భావిస్తున్న “సంయుక్త సైనిక కమాండ్ వ్యవస్థ” ఇప్పుడు అమలు దశకు చేరుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చర్చలకే పరిమితమైన ఈ వ్యవస్థపై ఇప్పుడు దేశ అత్యున్నత రక్షణ రంగ నాయకత్వం బహిరంగంగా మాట్లాడటం జాతీయ, అంతర్జాతీయ వ్యూహాత్మక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో భారత రక్షణ మంత్రి “రాజ్ నాథ్ సింగ్” మరియు భారత రక్షణ దళాల ప్రధాన సమన్వయ అధికారి (CDS) “అనిల్ చౌహాన్” చేసిన వ్యాఖ్యలు, భారత్ భవిష్యత్ యుద్ధాలకు ఎలా సిద్ధమవుతోందో స్పష్టంగా తెలియజేశాయి.

న్యూఢిల్లీలో నిర్వహించిన “కలామ్ అండ్ కవచ్ 3.0” అనే రక్షణ చర్చా వేదికలో మాట్లాడిన అనిల్ చౌహాన్, సంయుక్త సైనిక కమాండ్ వ్యవస్థకు సంబంధించిన తుది నివేదికను రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించామని వెల్లడించారు. ఇది సాధారణ ప్రకటన కాదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్మీ, నౌకాదళం, వాయుసేనల మధ్య అధికారాల పంపకం, నియంత్రణ విధానం, యుద్ధ సమయంలో నాయకత్వం వంటి అంశాలపై అనేక చర్చలు జరిగాయి. ముఖ్యంగా వాయుసేన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు తుది నివేదిక ప్రభుత్వానికి చేరడం అంటే, ఈ వ్యవస్థ ఆలోచన స్థాయిని దాటి అమలు దశలోకి ప్రవేశించినట్టే అని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.

మన సీడీఎస్ అనిల్ చౌహాన్ మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. “ఈ ప్రక్రియ ఆలస్యమైంది. కానీ ఇప్పుడు దానిని ముందుకు తీసుకెళ్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ మాట వెనుక గత కొంత కాలంగా సాగుతున్న భారీ వ్యూహాత్మక మార్పుల గురించి అర్థం అవుతుంది. ఇప్పటి వరకు భారత సైన్యంలో ఆర్మీ, వాయుసేన, నౌకాదళం వేర్వేరు కమాండ్ వ్యవస్థలతో పనిచేస్తున్నాయి. యుద్ధ సమయంలో పరస్పర సహకారం ఉన్నప్పటికీ, ఒకే నాయకత్వం కింద సమన్వయంతో పనిచేసే విధానం లేదు. కానీ ఆధునిక యుద్ధాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో తుపాకీ కాల్పులు కాదు. గగనతలం, సముద్రం, అంతరిక్షం, సైబర్ దాడులు, డ్రోన్ దళాలు ఇవన్నీ ఒకేసారి పనిచేసే పరిస్థితి ఏర్పడింది. 2020లో గాల్వాన్ ఘటన తర్వాత భారత్ ఈ అవసరాన్ని మరింత బలంగా గుర్తించింది.

సంయుక్త సైనిక కమాండ్ వ్యవస్థ దిశగా భారత్ అడుగులు….

ఇదే సమయంలో న్యూఢిల్లీలో జరిగిన మరో సమావేశంలో మాట్లాడిన రక్షణ మంత్రి “రాజ్‌నాథ్ సింగ్” కూడా భవిష్యత్ యుద్ధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆధునిక యుద్ధాలు విడివిడిగా పనిచేసే వ్యవస్థలను గౌరవించవు. భూమి, సముద్రం, గగనం, అంతరిక్షం, సైబర్ రంగాలు అన్నీ కలిసి పనిచేయాలి” అని ఆయన నొక్కి వక్కాణించారు. ఈ వ్యాఖ్యలు సాధారణ రాజకీయ ప్రసంగాలు కావు. ఇవి భారత ప్రభుత్వం భవిష్యత్ రక్షణ వ్యూహంపై తీసుకుంటున్న చర్యలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా “చైనా” ఇప్పటికే “సంయుక్త కమాండ్ వ్యవస్థ”ను అమలు చేసి తన సైన్యాన్ని సాంకేతిక సమన్వయంతో కూడిన యుద్ధ శక్తిగా మార్చుకున్న నేపథ్యంలో భారత్ కూడా అదే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

ఈ “సంయుక్త కమాండ్ వ్యవస్థ” అమలులోకి వస్తే భారత సైన్యంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం “ఉత్తర కమాండ్” చైనా మరియు పాకిస్థాన్ సరిహద్దులపై దృష్టి పెట్టవచ్చు. “సముద్ర కమాండ్” భారత మహాసముద్ర భద్రతను పర్యవేక్షించవచ్చు. “గగనతల రక్షణ కమాండ్” దేశ వైమానిక భద్రతను సమన్వయం చేయవచ్చు. అంటే భవిష్యత్‌లో యుద్ధ పరిస్థితి వస్తే ఆర్మీ ఒక విధంగా, వాయుసేన మరో విధంగా, నౌకాదళం ఇంకో విధంగా కాకుండా, మూడు దళాలు ఒకే వ్యూహంతో పనిచేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల నిర్ణయాల వేగం పెరుగుతుంది. ఆయుధాల వినియోగంలో సమర్థత వస్తుంది. సమాచార మార్పిడి వేగవంతమవుతుంది. డ్రోన్ యుద్ధాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత దాడులు, క్షిపణి వ్యవస్థల సమన్వయం మరింత బలపడుతుంది.

అయితే ఈ మార్పు అంత సులభం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సైనిక నిర్మాణాన్ని మార్చడం అంటే అది కేవలం పరిపాలనా మార్పు కాదు కదా…. ఒక పెద్ద వ్యూహాత్మక సంస్కరణ. యుద్ధ సమయంలో తుది అధికారం ఎవరి వద్ద ఉండాలి….? వాయుసేనను ప్రాంతాల వారీగా విభజించడం సరైనదేనా….? మూడు దళాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి….? వంటి అనేక అంశాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి.

అయినప్పటికీ ఇప్పుడు దేశ అత్యున్నత రక్షణాధికారి, రక్షణ మంత్రి బహిరంగంగా ఈ వ్యవస్థ గురించి మాట్లాడటం చూస్తుంటే, భారత్ ఇక కేవలం పెద్ద సైన్యం కలిగిన దేశంగా కాకుండా, సాంకేతికంగా సమన్వయంతో పనిచేసే “ఆధునిక యుద్ధ శక్తి”గా మారేందుకు సిద్ధమవుతోందని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రపంచ వ్యూహాత్మక పరిస్థితులు వేగంగా మారుతున్న ఈ సమయంలో భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయం సాధారణ సైనిక సంస్కరణ కాదు. ఇది చైనా లాంటి దేశాలకు వ్యూహాత్మక సమాధానం లాంటిది.

ఇది ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ స్థాయిని బలపరిచే ప్రయత్నం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే భవిష్యత్ లో “సైనికుల సంఖ్య” కంటే “సాంకేతిక సమన్వయం” ద్వారా వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం కీలకం అనే వాస్తవాన్ని భారత్ అధికారికంగా అంగీకరిస్తున్నట్లే.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading