Download App

భారత్… బంగ్లాదేశ్ వ్యాఖ్యలను లక్ష్యపెడుతుందా…?

మే 14, 2026 By Suresh Thota
బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో వినిపిస్తున్న కొన్ని వ్యాఖ్యలు భారతదేశంలో కొన్ని వర్గాలను ఆందోళన పరుస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు వంటి పదాలు కొన్ని టీవీ డిబేట్లు, సోషల్ మీడియా వేదికగా వీడియోలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా వైరల్ కావడంతో ప్రజల్లో అనుమానాలు...

బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో వినిపిస్తున్న కొన్ని వ్యాఖ్యలు భారతదేశంలో కొన్ని వర్గాలను ఆందోళన పరుస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు వంటి పదాలు కొన్ని టీవీ డిబేట్లు, సోషల్ మీడియా వేదికగా వీడియోలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా వైరల్ కావడంతో ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. అయితే ఈ మొత్తం చర్చను భావోద్వేగంతో కాకుండా, వాస్తవాలు–రాజకీయాలు–భద్రత అనే మూడు కోణాల్లో చూడాల్సిన అవసరం ఉంది.

మొదట స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారిక స్థాయిలో భారత భూభాగాన్ని కలుపుకుంటామని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అంత ధైర్యం కూడా లేదు. కానీ అదే సమయంలో అక్కడ కొన్ని మత ఛాందసవాద వర్గాలు, ముఖ్యంగా జమాతే ఇస్లాం బంగ్లాదేశ్ మరియు వాటి అనుబంధ వర్గాల్లో గ్రేటర్ బంగ్లాదేశ్ వంటి భావజాలం లేదని కూడా చెప్పలేం. చరిత్ర, మతం, భౌగోళిక భావోద్వేగాలను ఉపయోగించి కొందరు తీవ్రవాద నాయకులు ప్రజల్లో ఉద్రిక్త భావజాలాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు భారత భద్రతా వర్గాల్లో ఉంది.

ఇటీవల “పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాలో కలుపుకుంటాం”, “ఈశాన్య రాష్ట్రాలు కూడా మా ప్రభావంలోకి వస్తాయి” వంటి వ్యాఖ్యలు కొన్ని బంగ్లా వీడియోల ద్వారా ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీటిలో చాలావరకు ధృవీకరించబడిన ప్రభుత్వ విధాన ప్రకటనల కంటే సంచలన సృష్టించాలనే వీడియోలే ఎక్కువ. టీవీ ఛానళ్లు కూడా ప్రేక్షకాదరణ కోసం సందర్భాన్ని పక్కన పెట్టి ఘర్షణాత్మక అంశాలను ఎక్కువగా చూపిస్తున్నాయి. ఒక చిన్న వర్గ నాయకుడు మాట్లాడిన మాటను మొత్తం దేశ అధికారిక వైఖరిగా చూపించడం వల్ల అసలు వాస్తవం వక్రీకరించబడుతోంది.

అయితే భారత్‌కు ఆందోళన కలిగించే అంశాలు అసలు లేవా అంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా అక్రమ వలసలు, సరిహద్దు చొరబాట్లు, కంచెల ధ్వంసం, పశు సంపద అక్రమ రవాణా ముఠాలు వంటి అంశాలు, భారతదేశానికి చాలా కాలంగా భద్రతా సవాళ్ళు గా ఉన్నాయి. అందుకే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో కంచె నిర్మాణం వేగవంతం చేస్తామని ప్రకటించిన తరువాత బంగ్లాదేశ్ వైపు నుంచి “కంచె వేసి మమ్మల్ని భయపెట్టలేరు” అనే వ్యాఖ్య రావడం చర్చనీయాంశమైంది.

ఆ వ్యాఖ్యను కొందరు భారత్‌కు బంగ్లాదేశ్ హెచ్చరికగా చూపించినా, వాస్తవానికి అది ఒక దేశ రాజకీయ దౌత్య ప్రతిస్పందనగా చూడాలి. బంగ్లాదేశ్ తమ దేశాన్ని శత్రువులా చూడొద్దని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే భారత్ వైపు నుంచి చూస్తే సరిహద్దు కంచె అనేది భద్రతాపరంగా చాలా అవసరం. ఎందుకంటే భారత్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భూసరిహద్దుల్లో ఒకటి. అనేక గ్రామాలు సరిహద్దు వెంట ఉండటం, అక్రమ రవాణా ముఠాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల రవాణా వంటి సమస్యలు నిరంతరం కొనసాగుతూనే ఉంటున్నాయి.

ఈ సరిహద్దు ఉద్రిక్తతల్లో సరిహద్దు భద్రతా దళం కాల్పుల అంశం కూడా చాలా సున్నితమైనది. ఇటీవల మన త్రిపుర రాష్ట్ర సరిహద్దు వద్ద ఇద్దరు బంగ్లాదేశీయులు కాల్పుల్లో మరణించిన ఘటన వార్తల్లోకి వచ్చింది. సరిహద్దు భద్రతా దళం ప్రకారం వారు అక్రమ రవాణాదారులు కాగా, తమపై వాళ్ళు రాళ్ళ దాడికి పాల్పడటంతో ఆత్మరక్షణలో కాల్పులు జరిపామని తెలిపింది. మరోవైపు బంగ్లాదేశ్ మీడియా మాత్రం నిరాయుధ పౌరులపై తూటాల దాడి గా ఆరోపించింది. ఈ రెండు కథనాలు ఆ దేశ సరిహద్దు దగ్గర జరిగే సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది.

సోషల్ మీడియాలో చూపించే విధంగా భారత్ యుద్ధ తరహా చర్యలు తీసుకుంటోందని చెప్పడం సరైంది కాదు. అక్కడ ప్రధానంగా వ్యవహరించేది సరిహద్దు భద్రతా దళం. వీరి పని సరిహద్దు భద్రతను నిర్వహించడం. కానీ సరిహద్దు నేరాలు, అక్రమ రవాణా, చొరబాట్లు పెరిగినప్పుడు ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ తరచుగా మానవ హక్కుల సమస్య గా ప్రపంచానికి చెబుతోంది.

(కానీ అంతర్జాతీయ రాజకీయ ప్రయోజనాలు, విదేశీ ప్రభావం, మతపరమైన భావజాల వలయాలు, అంతర్గత అధికార పోరాటాలు మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి.)

మొదటగా “బంగ్లాదేశ్‌”లో అంతర్గత రాజకీయ అస్థిరత ఒక ప్రధాన కారణం. ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, ప్రభుత్వ వ్యతిరేక అసంతృప్తి పెరిగినప్పుడు చాలామంది నాయకులు ప్రజల దృష్టిని మళ్లించడానికి, పక్క దేశాన్ని “శత్రువు” గా చూపించి రాజకీయాలను చేస్తుంటారు. ఇలా భారత వ్యతిరేక వ్యాఖ్యలు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి వాళ్ళకి ఒక సాధనంగా మారుతుంటాయి.

రెండవది మతపరమైన తీవ్రవాద భావజాల వలయాలు. జమాతే ఇస్లాం వంటి సంస్థలు కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కావు. వీటి వెనుక దశాబ్దాలుగా పెరిగిన మత మౌఢ్యం తలకెక్కించుకున్న విష వలయాలు ఉన్నాయి. ముస్లింల ఐక్యత, సరిహద్దులు సృష్టి, మతరాజకీయ ఏకత్వం వంటి భావజాలాలను ఉపయోగించి యువతలో ఉద్రిక్త భావాలను పెంచే ప్రయత్నాలు జరుగుతుంటాయి.

మూడవది పాకిస్తాన్ ప్రభావం. “బంగ్లాదేశ్ విమోచన” యుద్ధం తరువాత కూడా పాకిస్తాన్ అనుకూల మతవాద వర్గాలు పూర్తిగా అంతరించిపోలేదు. భారత్‌పై ఒత్తిడి పెంచడానికి దక్షిణాసియాలో మతవాద వర్గాలను పరోక్షంగా ప్రోత్సహించే ప్రయత్నాలు పాకిస్తాన్ గూఢచారి వ్యవస్థ గతంలో చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాని భారత వ్యతిరేక భావజాలానికి అక్కడి కొన్ని వర్గాల నుంచి మద్దతు లభించడం మాత్రం నిజం.

నాలుగవది చైనా వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. కాని చైనా నేరుగా “గ్రేటర్ బంగ్లాదేశ్” వంటి భావజాలాన్ని ప్రోత్సహిస్తోందని అనడానికి ఆధారాలు లేవు. కానీ భారత పొరుగు దేశాల్లో తన ప్రభావాన్ని పెంచడం, భారత్‌ను ప్రాంతీయ ఒత్తిడుల్లో నిమగ్నం చేయడం, చైనా దీర్ఘకాల వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, పాకిస్తాన్‌లలో చైనా భారీ పెట్టుబడులు దీనికి ఉదాహరణలుగా చెప్పబడుతున్నాయి.

ఐదవది సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువైపోయింది. ఒక సభలో చేసిన వ్యాఖ్యలను, చిన్న, చిన్న వీడియోలుగా కట్ చేసి, సమాజంలో ఉద్రిక్తతలను పెంచడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇప్పుడు చాలా సులభమైపోయింది. దీంతో చిన్న, చిన్న మాటలు కూడా పెద్ద ప్రజా చర్చగా మారుతున్నాయి. చాలా సందర్భాల్లో ప్రజలు పూర్తి ప్రసంగం కాకుండా కేవలం రెచ్చగొట్టే కొన్ని సెకన్ల క్లిప్‌లను మాత్రమే చూస్తున్నారు.

బంగ్లాదేశ్ మొత్తం భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమైందని అనుకోవడం వాస్తవానికి చాలా దూరం. అక్కడ కూడా మితవాద ప్రజలు, భారత్‌తో వ్యాపార సంబంధాలు కోరుకునే వర్గాలు, సామాన్య ప్రజల జీవన సమస్యలపై దృష్టి పెట్టే సమూహాలు ఉన్నాయి. అంటే అక్కడ కూడా అంతర్గత భావజాల పోరాటం కొనసాగుతోంది.

చివరికి ఈ మొత్తం పరిణామం ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. టీవీ చర్చలు, వైరల్ వీడియోలు, సంచలన శీర్షికలు చూసి వెంటనే నిర్ణయాలకు రావడం ప్రమాదకరం. ఒక చిన్న వర్గ నాయకుడి వ్యాఖ్యను మొత్తం దేశ అధికారిక యుద్ధ ప్రకటనగా చూపించడం ఎంత తప్పో, అదే విధంగా సరిహద్దు భద్రతా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కూడా అంతే ప్రమాదకరం. భావోద్వేగం కంటే వాస్తవాలను, ప్రచారం కంటే భౌగోళిక రాజకీయాలను, సంచలనం కంటే వ్యూహాత్మక వాస్తవాలను అర్థం చేసుకున్నప్పుడే భారత్ మరియు బంగ్లాదేశ్ సంబంధాల అసలు కోణంలో మాత్రమే చూడగలం.

ముగింపు: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు, వాళ్ళ మంత్రులు… మొదట్లో భారత్‌కు , ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నోరుపారేసుకున్న తర్వాత, ప్రధాని మోడీ లక్షద్వీప్‌లో పర్యటించి, అక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఫోటోలు షేర్ చేశారు… అంతే మాల్దీవుల అధ్యక్షుడు…తన వైఖరిని మార్చుకుని భారత్‌తో సత్సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సి వచ్చింది. దీని వెనుక మోడీ ప్రభుత్వం అవలంబించిన దౌత్యపరమైన, ఆర్థికపరమైన వ్యూహాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఏదైనా అంతే…. బంగ్లాదేశ్ ను ఎలా కంట్రోల్ చేయాలో… భారత్ కు మోడీకి తెలుసు…

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading