తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల డిసెంబర్ కోటా ఆన్‌లైన్‌లో విడుదల
September 18, 2025 Published by Rahul N

శ్రీవారి భక్తులకు మరో శుభావకాశం లభించబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా టీటీడీ నుంచి విడుదలైన ప్రకటన ప్రకారం, ఈసేవా టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు సెప్టెంబర్ 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. టికెట్ల కేటాయింపు పూర్తిగా లక్కీ డిప్ పద్ధతిలో జరగనుంది. ఇందులో భాగంగా అంగప్రదక్షిణ టోకెన్లను కూడా ఆన్‌లైన్ డిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
టికెట్స్, టోకెన్స్ పొందిన భక్తులు సెప్టెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు విజయవంతంగా సొమ్ము చెల్లించిన వారికి మాత్రమే డిప్ ద్వారా టికెట్లు మంజూరు చేస్తారు. ఈ విధానం భక్తులకు పారదర్శకంగా అవకాశాలు లభించేలా రూపొందించబడిందని టీటీడీ తెలిపింది.
ఇక ప్రత్యేక సేవల విషయానికి వస్తే, సెప్టెంబర్ 22 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు విడుదల కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల టికెట్లు కూడా కేటాయించనున్నారు.
సెప్టెంబర్ 24 ఉదయం 10 గంటలకు ప్రత్యేక దర్శనం 300 రూపాయల టిక్కెట్ల కోట, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల బుకింగ్ అందుబాటులోకి రానుంది.
భక్తులు తమకు కావలసిన సేవా టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో సమయానికి నమోదు చేసుకోవాలని, ఆన్‌లైన్ లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.
