వార్తలు

అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని తెలుగు భక్తుడు మృతి

Published by
Srinivas

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గిరి ప్రదక్షిణలో భాగంగా ఉన్న మోక్ష మార్గం (మోక్ష ద్వారం)లో ఇరుక్కుపోయిన ఓ తెలుగు భక్తుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన భక్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

అరుణాచలేశ్వర స్వామి దర్శనం, గిరి ప్రదక్షిణ కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అరుణాచలానికి తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన మణికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి అరుణాచలం చేరుకున్నారు.

రాత్రి సుమారు 11 గంటల సమయంలో గిరి ప్రదక్షిణ మార్గంలోని మోక్ష ద్వారం గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన మణికుమార్.. శరీరాకృతి కారణంగా ఆ ఇరుకు మార్గంలో చిక్కుకుపోయారు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోవడంతో తీవ్రంగా ఉక్కిరిబిక్కిరయ్యారు. కొద్ది సేపటికే ఆయనకు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది.

ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు ఎంతో శ్రమించి మణికుమార్‌ను బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మణికుమార్ మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఆలయ దర్శనం కోసం కుటుంబంతో కలిసి వచ్చిన మణికుమార్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషాద ఘటన అక్కడి భక్తులను కూడా కలచివేసింది.

ఘటనపై సమాచారం అందుకున్న తిరువణ్ణామలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో అరుణాచలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts