
తెలుగు ప్రేక్షకులకు గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన కామెడీ కథలు ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంటాయి. అలాంటి ఓ డిఫరెంట్ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పల్లబురుసు’ తాజాగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌తో పాటు EPIC స్టూడియోస్ నిర్మాణ భాగస్వామ్యంతో తెరకెక్కిన ‘పల్లబురుసు’ ఆగస్టు 14, 2026న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. థియేట్రికల్ రిలీజ్‌కు మూడు వారాలు కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి రావడం విశేషం.
అంతేకాదు.. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ సినిమా అందుబాటులోకి రావడంతో ఇతర ప్రాంతాల ప్రేక్షకులను కూడా చేరుకునే అవకాశం ఏర్పడింది.

టూత్‌బ్రష్‌తో మొదలైన గొడవ.. కోర్టు వరకు వెళ్లిన కథ!
సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాతో ఉదయ్ చౌహాన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో చిన్న విషయమే ఎంత పెద్ద సమస్యగా మారుతుందనే అంశాన్ని ఆసక్తికరంగా చూపించినట్లు తెలుస్తోంది.
కథలో ఓ వృద్ధ తండ్రికి టూత్‌బ్రష్ ఉపయోగించమని సలహా వస్తుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతని కుమారుడు టూత్‌బ్రష్ కొనడానికి నిరాకరిస్తాడు. ఈ చిన్న విషయంపై మొదలైన వాగ్వాదం క్రమంగా పెద్ద గొడవగా మారుతుంది.
ఆ తర్వాత విషయం గ్రామ పంచాయతీ, పోలీస్ కంప్లైంట్ దాటి చివరకు విచిత్రమైన కోర్టు వ్యవహారం వరకు వెళ్తుంది. ఈ క్రమంలో కుటుంబంలో ఏళ్లుగా పేరుకుపోయిన మనస్పర్థలు, వృద్ధాప్యంలో ఎదురయ్యే ఒంటరితనం వంటి అంశాలు కూడా కథలో భాగమవుతాయి.
ఓటీటీలో అయినా మెప్పిస్తుందా?
థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ‘పల్లబురుసు’కు ఓటీటీ రిలీజ్‌తో కొత్త ప్రేక్షకులు దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, కామెడీ టచ్‌తో పాటు కుటుంబ సంబంధాలను టచ్ చేసే కథ కావడంతో డిజిటల్ ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రంలో పృజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి, కిరణ్ మాచా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పవన్ సీ సంగీతం అందించారు.
థియేటర్లలో మిస్ అయిన ఈ రూరల్ కామెడీని ఇప్పుడు ఓటీటీలో చూసి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
