Download App

తిరుమల నెయ్యి టెండర్లపై వివాదం… టీటీడీ వివరణ

ఫిబ్రవరి 19, 2026 By Suresh Thota
"చేతగాని అమ్మ కు చేష్టలు ఎక్కువ" అని ఒక సామెత…. అలానే ఉంది టీటీడీ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి పక్షం పాత్ర… వాళ్ళు చేసిన పని గురించి ప్రస్తావించకుండా… పై పెచ్చు టీటీడీ మీద, ప్రభుత్వం పైన నెయ్యి విషయంలో ఆరోపణలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ...
తిరుమల నెయ్యి టెండర్లపై వివాదం… టీటీడీ వివరణ

“చేతగాని అమ్మ కు చేష్టలు ఎక్కువ” అని ఒక సామెత…. అలానే ఉంది టీటీడీ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి పక్షం పాత్ర… వాళ్ళు చేసిన పని గురించి ప్రస్తావించకుండా… పై పెచ్చు టీటీడీ మీద, ప్రభుత్వం పైన నెయ్యి విషయంలో ఆరోపణలు చేస్తున్నారు.

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరా టెండర్లపై రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హెరిటేజ్‌కు సంబంధం ఉన్న ఇందాపూర్ డెయిరీకి అధిక రేట్లకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ అంశంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అయితే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఈ ఆరోపణలను ఖండిస్తూ వివరాలు వెల్లడించారు. ఇందాపూర్ డెయిరీకి “హెరిటేజ్” సంస్థతో ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని, హెరిటేజ్ అక్కడి నుంచి కేవలం చీజ్ మాత్రమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. అనేక ఇతర సంస్థలు కూడా అదే డెయిరీ నుంచి ఉత్పత్తులు తీసుకుంటున్నాయని చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం టెండర్లు ఇచ్చిన సమయంలో కూడా “అమూల్” సంస్థ “ఇందాపూర్” నుంచే సరఫరా పొందిందని ఆయన గుర్తు చేశారు.

“నందిని” డెయిరీని తొలగించలేదని కూడా టీటీడీ స్పష్టం చేసింది. అవసరమైన మొత్తాన్ని పూర్తిగా సరఫరా చేయలేమని ఆ సంస్థ తెలియజేయడంతో ఇతర సరఫరాదారులకు టెండర్లు ఇవ్వాల్సి వచ్చిందని వివరించింది. ప్రస్తుత టెండర్లలో ఇందాపూర్ డెయిరీకి రెండు, సంగం డెయిరీకి ఒకటి, మదర్ డెయిరీకి రెండు టెండర్లు కేటాయించినట్లు తెలిపింది.

నాణ్యత కోసం కొత్త కొనుగోలు విధానం అమలు చేస్తుంది. నెయ్యి నాణ్యత మెరుగుపరచడానికి టీటీడీ కొత్తగా చర్యలు చేపట్టింది. ఇంతకు ముందు సుమారు 1500 కిలోమీటర్ల దూరం నుంచి నెయ్యి రవాణా జరుగుతుండగా, ఇప్పుడు దాన్ని 800 కిలోమీటర్లకు పరిమితం చేసింది. దీంతో తాజాదనం, వాసన, నిల్వ సామర్థ్యం మెరుగుపడుతాయని అధికారులు చెబుతున్నారు.

MRL స్కోర్‌బోర్డు విధానం అనే ప్రక్రియను టీటీడీ అమలు చేస్తున్నది. MRL (Maximum Residue Limit) స్కోర్‌బోర్డు విధానం ఆహార భద్రతపై ఆధారపడిన పూర్తి శాస్త్రీయ పద్ధతి. పశువులకు ఇచ్చే మేత, మందుల అవశేషాలు, రసాయనాలు పాలలో ఉండే పరిమితిని MRL అంటారు. ప్రతి నెయ్యి బ్యాచ్‌ను ప్రయోగశాలలో పరీక్షిస్తారు. అవశేషాల స్థాయి ఎక్కువైతే సరఫరా చేసే సంస్థ ని వెంటనే నిలిపివేస్తారు. ప్రతి సరఫరాదారునికి నాణ్యత స్కోర్ కేటాయిస్తారు, తక్కువ స్కోర్ వస్తే భవిష్యత్ టెండర్లలో అర్హత కోల్పోతారు. ఈ విధానం ద్వారా ఎక్కువ “ధర” కాకుండా “ఎక్కువ నాణ్యత” ప్రధాన ప్రమాణంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.

మొత్తానికి టీటీడీ అన్ని స్థాయిల్లో నాణ్యత ప్రమాణాలు, ప్రక్రియలు పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెబుతుండగా, ప్రతిపక్షం మాత్రం తాము గతంలో చేసిన తప్పిదాలను అనగా… తమ ప్రభుత్వ హయాంలో… నెయ్యి టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలు వదిలేసి… ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలు పై పెద్ద ఎత్తున విమర్శలు చేసి… ప్రతి దానికి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ప్రతి పక్షానికి గట్టి సమాధానం చెబుతున్నారు.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading