అంతర్జాతీయం

భారత్‌తో వాణిజ్య చర్చలకు ట్రంప్ నో !

Published by
Srinivas

భారత్‌పై భారీ సుంకాల విధానంతో ఇప్పటికే అమెరికా ఒత్తిడి పెంచిన నేపథ్యంలో, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి దుమారం రేపారు. భారత్‌తో వాణిజ్య చర్చలు అవసరం లేదని స్పష్టం చేసిన ఆయన, రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాణిజ్య చర్చలపై మీడియా ప్రశ్నకు స్పందించిన ట్రంప్, “విషయం కొలిక్కి వచ్చేంతవరకూ భారత్‌తో చర్చలు ఉండవు,” అని తేల్చి చెప్పారు. ఇది భారత్-అమెరికా సంబంధాల్లో తీవ్ర స్థాయిలో ఉత్కంఠకు దారితీసింది.

భారతీయ ఉత్పత్తులపై సుంకాల మోత

అమెరికా ఇప్పటికే భారత ఉత్పత్తులపై 25 శాతం దిగుమతి సుంకం విధిస్తుండగా, బుధవారం ట్రంప్ మరో 25 శాతం అదనపు సుంకానికి ఆమోదం తెలిపారు. ఈ తాజా నిర్ణయంతో, ఆగస్ట్ 27 నుంచి మొత్తం 50 శాతం సుంకం అమల్లోకి రానుంది. భారత ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది.

దేశ ప్రయోజనాలే ముఖ్యం: మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన ప్రధాని, “దేశ ప్రయోజనాల కోసం నేను వెనక్కి తగ్గను, రైతులు, మత్స్యకారులు, డెయిరీ రంగాలపై భారత్ రాజీ పడదు.” అని ఆయన స్పష్టంచేశారు.

అమెరికా ద్వంద్వ ప్రమాణాలపై భారత్ ప్రశ్నలు

అమెరికా చర్యలపై నిపుణులు ద్వంద్వ ప్రమాణాలు అని విమర్శిస్తున్నారు. రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చైనా, టర్కీపై ఎందుకు సుంకాలు విధించకపోతున్నారు? అని భారత్ ప్రశ్నించింది.

ప్రశ్నార్థకంగా వాణిజ్య సంబంధాలు

ఈ పరిణామాలతో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు ప్రశ్నార్థకంగా మారాయి. ట్రంప్ విధానం అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశంతో ఉన్నా, అంతర్జాతీయ వాణిజ్య నియమాలకు వ్యతిరేకంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts