
”దొరల గెలువవచ్చు దొడ్డ సైన్యము చేత
వైరి గెలువవచ్చు వాడి చేత
మనసు గెలువలేడు మహిలోన నెవ్వడు
విశ్వదాభిరామ వినరవేమ!”
ఆయుధాలతో శత్రువులను జయించవచ్చు, పెద్ద సైన్యంతో రాజులను గెలవవచ్చు. కానీ కోట్లాది మంది ప్రజల మనస్సులను గెలవడం అందరి వల్ల సాధ్యం కాదు. 2014 నుండి నేటివరకు వరుస ఎన్నికల్లో ప్రజలు నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పడుతున్నారంటే, ఆయన ప్రజల హృదయాలను గెలుచుకున్నారనేది స్పష్టమవుతోంది.
భారతదేశ రాజకీయ యవనికపై నరేంద్ర మోదీ ప్రస్థానం ఒక అసాధారణ అధ్యాయం. ఒక సామాన్య కుటుంబం నుండి ఎదిగి, సుదీర్ఘ కాలం పాటు ఎక్కడా విరామం లేకుండా ప్రజామోదంతో పరిపాలన సాగించడం ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక వినూత్న రికార్డు. అనేక జాతులు ,కులాలు, వర్గాలు, మతాలు, రకరకాల భాషలు,భిన్నమైన వాతావరణ పరిస్థితితులు ఇలా ఒకటేమిటి… ఒకదానితో మరొకటి పొంతన కుదరని రాజకీయ పార్టీలు, 140 కోట్ల జనాభా కలిగిన భారత దేశాన్ని ఏకతాటి పై నడిపించడం మామూలు విషయం కాదు, అందునా ఇంత డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి, సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, ప్రధానిగా పుష్కర కాలం దేశానికి ప్రధానికి గా ఉండటం మామూలు విషయం కాదు. నెహ్రూ, ఇందిరా గాంధీ టైమ్ లో జనాభా, రాజకీయ లెక్కలు వేరు, ఇప్పటి భారతావని లెక్కలు వేరు…. అయినప్పటికీ ప్రధానిగా పుష్కర కాలం పూర్తి చేసుకోవడం ఒక్క “నరేంద్ర మోడీ” కే చెల్లినట్లైంది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి మహామహుల రికార్డులను సైతం అధిగమిస్తూ, గడిచిన పన్నెండేళ్లుగా దేశాన్ని అప్రతిహతంగా ప్రగతి పథంలో నడిపిస్తున్న తీరుపై ప్రత్యేక విశ్లేషణ.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం ప్రధానులుగా పనిచేసిన ఘనత నెహ్రూ, ఇందిరా గాంధీలకే దక్కింది. అయితే, దేశంలో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ‘ఎన్నుకోబడిన’ ఒక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ ఎలాంటి విరామం (బ్రేక్) లేకుండా అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రికార్డును నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. వరుసగా 4,399 రోజులకు పైగా ప్రధాని పీఠంపై ఉండి, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నెలకొల్పిన సుదీర్ఘ నిరంతర పరిపాలన రికార్డును మోదీ అధిగమించారు. ఇందిరా గాంధీ 15 ఏళ్లకు పైగా ప్రధానిగా ఉన్నప్పటికీ, ఆమె హయాం మధ్యలో జనతా పార్టీ రాకతో బ్రేక్ పడింది. కానీ మోదీ ప్రస్థానం ఎలాంటి విరామం లేకుండా సాగుతుండటం ఆయనకున్న ప్రజాదరణకు నిదర్శనం.

సీఎం నుండి పీఎం సుదీర్ఘ ప్రయాణం…
నరేంద్ర మోదీ రాజకీయ ప్రయాణంలో అత్యంత అరుదైన, అద్భుతమైన అంశం ఏమిటంటే, ఆయన అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఎక్కడా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా 25 ఏళ్లకు పైగా నిరంతరం ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా కొనసాగడం. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2014 వరకు వరుస విజయాలతో ఆ రాష్ట్రాన్ని పాలించారు. ఆ వెంటనే 2014 మే 26న దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, నేటికీ ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా, ఆపై ప్రధానమంత్రిగా పావు శతాబ్ద కాలం పాటు ఎక్కడా విరామం లేకుండా, ఓటమి ఎరుగని నేతగా సాగడం ప్రపంచ రాజకీయాల్లోనే ఒక అరుదైన రికార్డు.
దశాబ్దాల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు
గత ప్రధానులు ఎవరూ ముట్టుకోవడానికి కూడా సాహసించని, దశాబ్దాలుగా నలుగుతున్న అత్యంత క్లిష్టమైన జాతీయ సమస్యలను మోదీ తన రాజకీయ చతురతతో, బలమైన ఉక్కుసంకల్పంతో పరిష్కరించి చూపించారు. జమ్మూ కాశ్మీర్‌లో “ఆర్టికల్ 370” రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపారు. వందల ఏళ్ల నాటి “అయోధ్య రామమందిర” వివాదానికి శాంతియుత మార్గంలో పరిష్కారం చూపి, భవ్య మందిర నిర్మాణాన్ని సాకారం చేశారు. ఇవి కేవలం రాజకీయ నిర్ణయాలు కావు, దేశ సమగ్రతను, సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించిన చారిత్రాత్మక ఘట్టాలు.
సంక్షేమంతో పేదల చెంతకు సుపరిపాలన
గతంలో “ప్రభుత్వం రూపాయి విడుదల చేస్తే పేదవాడికి చేరేది 15 పైసలే” అనే నానుడి ఉండేది. ఆ వ్యవస్థను మోదీ కూకటివేర్లతో సహా పెకలించేశారు. జన్‌ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేశారు. పీఎం-కిసాన్ నిధులైనా, వృద్ధాప్య పింఛన్లైనా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే వెళ్తున్నాయి. సుమారు 81 కోట్ల మందికి ఉచిత రేషన్, 4 కోట్లకు పైగా పేదలకు పక్కా ఇళ్లు, 10.5 కోట్ల మంది మహిళలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు అందించడం ద్వారా సంక్షేమాన్ని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో నిజం చేసి చూపించారు.
మౌలిక వసతుల కల్పనలో
దేశంలో మౌలిక వసతుల కల్పన గతంలో ఎన్నడూ లేనంత వేగంతో దూసుకుపోతోంది. అటల్ సేతు, సుదర్శన్ సేతు, చీనాబ్ రైలు బ్రిడ్జి వంటి అద్భుత ఇంజనీరింగ్ అద్భుతాలు ఈయన కాలంలోనే సాకారమయ్యాయి. దేశీయ సాంకేతికతతో రూపొందిన 164 వందేభారత్ రైళ్లు, భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేశాయి. 26 నగరాలలో 1100 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, విమానాశ్రయాల సంఖ్యను 74 నుండి 164కి పెంచడం, అంతేగాకుండా బుల్లెట్ ట్రైన్స్ ద్వారా భారతదేశ వేగాన్ని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారు.

రక్షణ రంగంలో రాజీ పడని భారత్…
ఒకప్పుడు సైనికుల షూస్ మరియు రక్షణ పరికరాల కోసం, ఇతర దేశాల వైపు చూసే భారత్, నేడు మోదీ నాయకత్వంలో సొంతంగా ఆయుధాలను తయారు చేసుకునే స్థాయికి చేరింది. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 38,400 కోట్లకు చేరడం దేశ సార్వభౌమత్వానికి దక్కిన గౌరవం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా శత్రువుల గుండెల్లో సింహ గర్జన చేసి వారి గుండెల్లో నిద్రపోయిన ధీరత్వం మోదీ సొంతం. దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తన చేతలతో నిరూపించారు. ఎక్కడ ముగించాలో… ఎక్కడ కొనసాగించాలో తెలిసిన వ్యక్తి మోడీ, దానికి నిదర్శనం “ఆపరేషన్ సింధూర్”.
వలస పాలన గుర్తుల తొలగింపు..
బ్రిటిష్ కాలం నాటి బానిసత్వపు గుర్తులను చెరిపేస్తూ, భారతీయ సంస్కృతి, వైభవం అందరికీ తెలిసే విధంగా మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందులో భాగంగానే దశాబ్దాల నాటి ‘రాజ్‌పథ్’ను ‘కర్తవ్యపథ్’గా మార్చారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం, జాతీయ యుద్ధ స్మారకం (National War Memorial) ఏర్పాటు, దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక క్షేత్రాల (కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహాకాల్ లోక్) పునర్నిర్మాణం ద్వారా భారతదేశ ప్రాచీన వైభవానికి, ఆధునిక ఆకాంక్షలకు మోదీ అద్భుత వారధిగా నిలిచారు.

ప్రపంచ వేదికపై విశ్వగురువుగా
అంతర్జాతీయ రాజకీయాలలో నేడు భారతదేశం చెప్పే మాట కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధంనందైనా, గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభమైనా భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు మోదీ దౌత్య నీతికి అద్దం పడుతున్నాయి. జీ-20 సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్‌ను నాయకుడిగా నిలిపారు. నేడు ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా పరిష్కారం కోసం మోదీ వైపు చూసేలా భారత ప్రతిష్టను శిఖరాగ్రాన నిలిపారు.
ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా..
2014కు ముందు ‘fragile five’ (సమస్యల్లో ఉన్న ఐదు ఆర్థిక వ్యవస్థలు) జాబితాలో ఉన్న భారతదేశాన్ని, నేడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మోదీ నిలబెట్టారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నారు. జిఎస్‌టి (GST) వంటి విప్లవాత్మక పన్ను సంస్కరణలు, డిజిటల్ ఇండియా విప్లవం ద్వారా ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరిగే దేశంగా భారత్‌ను తీర్చిదిద్దారు. నేడు ప్రపంచ వ్యాపారవేత్తలకు అత్యంత సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడుల కేంద్రంగా భారత్ మారింది.
ముగింపు :
నరేంద్ర మోదీ హయాంలో భారతదేశం ఆత్మవిశ్వాసంతో కూడిన “సరికొత్త భారత్” గా అవతరించింది. మాటల కంటే చేతలకు, ప్రకటనల కంటే ఫలితాలకు ప్రాధాన్యతనిచ్చే మోదీ శైలి వల్లే ఈ అద్భుతాలు సాధ్యమయ్యాయి. ముఖ్యమంత్రిగా ప్రస్థానం ప్రారంభించి, నేడు దేశంలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా పాలించిన అజేయ నేతగా ఎదిగిన మోదీ నాయకత్వంలో, భారత్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా మారాలనే బలమైన సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఇది ఒక వ్యక్తి విజయం కాదు, ఒక నవ భారత ప్రస్థానం.
