
వైస్ ఛాన్సలర్లను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆరోపించడం కరెక్ట్ కాదన్నారు మంత్రి నారా లోకేష్. దమ్ముటే ఆధారాలు చూపించాలని, వెంటనే విచారణకు ఆదేశిస్తానని సవాల్ విసిరారు. 19 మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17మందిని బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
“వైస్ చాన్సలర్లను మేం బెదిరించడం ఏమిటి? గవర్నర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు నడుస్తాయి. ఎవరు బెదిరించారో చెప్పమనండి. గతంలో ఎపిపిఎస్ సి చైర్మన్ ను రూంలోకి వెళ్లకుండా తాళం వేశారు. మీరా మాట్లాడేది? మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. విసిలు తప్పుచేశారు కనుకే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఎవరు బెదిరించారో చెప్పండి,నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎపిపిఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పండి.”
ఇలా సవాల్ విసిరారు లోకేష్. విసి పదవుల కోసం 500 మంది దరఖాస్తు చేశారని, గత ప్రభుత్వం మాదిరిగా విసి పోస్టులను ఒకే వర్గానికి కట్టబెట్టలేదన్నారు మంత్రి.
బెదిరించడం, భయపెట్టడం, బయటకు పంపడం గత ప్రభుత్వానికి అలవాటని, ముఖ్యమంత్రి సభలకు తాము స్కూలు పిల్లలను పంపలేదని మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. పరదాలు కట్టుకొని తిరగడం, తీర్పులు చెప్పిన జడ్జిల భార్యలపై పోస్టులు పెట్టడం గత ప్రభుత్వంలో కొంతమందికి అలవాటని, ఈ కేసులో ఇప్పటికే కొందరు జైలులో ఉన్నారని మంత్రి లోకేష్ గుర్తుచేశారు.
