Download App

ధైర్యానికి, నిజాయితీకి నిదర్శనం మన ఆంధ్రకేసరి… వర్ధంతి నేడు…

మే 20, 2026 • By Suresh Thota
నేడు ​స్వార్థం నిండిన రాజకీయాలు, పదవుల కోసం పాకులాడే మనస్తత్వాలు, అవినీతికి వెరవని వ్యక్తిత్వాలు, అందలం కోసం అయినవారిని అడ్డు తొలగించుకునే, నేటి వర్ధమాన రాజకీయ నాయకులు ఉన్న ఈ తరుణంలో... ఆస్తులను త్యాగం చేసి, తను నమ్మిన సిద్ధాంతాలు, తను కలలు కన్న ఆశయాల కోసం బతికిన...
ధైర్యానికి, నిజాయితీకి నిదర్శనం మన ఆంధ్రకేసరి… వర్ధంతి నేడు…

నేడు ​స్వార్థం నిండిన రాజకీయాలు, పదవుల కోసం పాకులాడే మనస్తత్వాలు, అవినీతికి వెరవని వ్యక్తిత్వాలు, అందలం కోసం అయినవారిని అడ్డు తొలగించుకునే, నేటి వర్ధమాన రాజకీయ నాయకులు ఉన్న ఈ తరుణంలో… ఆస్తులను త్యాగం చేసి, తను నమ్మిన సిద్ధాంతాలు, తను కలలు కన్న ఆశయాల కోసం బతికిన మహోన్నత నాయకుడు, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం, ఆయన చూపిన తెగువ, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు , ఆయన జీవన విధానం, నేటి తరాలకు సదా స్మరణీయం.

​బ్రిటీష్ వారి పై సింహగర్జనతో ఆంధ్ర కేసరి…

టంగుటూరి ప్రకాశం పంతులు పేరు వినగానే మనకు గుర్తొచ్చే బిరుదు ఆంధ్రకేసరి (ఆంధ్రా సింహం). ఈ బిరుదు ఆయనకు ఊరికే రాలేదు, బ్రిటీష్ వారి తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ఆయన ధైర్యానికి అది ప్రతీక. ​1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ మద్రాసు పర్యటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. సైమన్ గోబ్యాక్ నినాదాలతో మద్రాసులో జరిగిన ఆందోళనల్లో, బ్రిటీష్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. ఆ మృతదేహాన్ని చూడటానికి వెళ్తున్న ప్రజలను, నాయకుల ను పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వస్తే కాల్చిపారేస్తాం అని బ్రిటీష్ సైన్యం ప్రజల పై తుపాకులు ఎక్కుపెట్టి హెచ్చరించింది. ​ఆ సమయంలో అక్కడికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం ఏమాత్రం వెరవలేదు. తన కోటు గుండీలు విప్పి, రొమ్ము చూపిస్తూ… “కాల్చండిరా…. కాల్చండి… ఎంతమందిని కాలుస్తారో నేనూ చూస్తాను…” అంటూ సింహంలా ముందుకు దూకారు. ఆయన రౌద్ర రూపానికి, సాహసానికి బ్రిటీష్ సైనికులు బిత్తరపోయి తుపాకులు దించేశారు. ఈ అపూర్వ శౌర్యానికి ముగ్ధులైన ప్రజలు ఆయనను “ఆంధ్రకేసరి” అని పిలుచుకున్నారు.

ఆయన నిజాయితీ కి ఉదాహరణ…

1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, 80 ఏళ్ల వయసులో ఆయన నవ్యాంధ్రకు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. లాయర్‌ గా మద్రాసులో నెలకు వేలాది రూపాయలు సంపాదించిన ప్రకాశం గారు, దేశ సేవ కోసం తన ఆస్తినంతా కర్పూరంలా కరిగించేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన చూపిన నిజాయితీకి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి టంగుటూరి ప్రకాశం గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను కలవడానికి కొందరు బంధువులు వచ్చారు. వారు ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడమే కాకుండా, సీఎం నివాసంలోనే బస చేశారు. ఈ విషయం గమనించిన ఆయన, వారు ప్రయాణించిన దూరానికి అయిన పెట్రోల్ ఖర్చులను, వారు తిన్న భోజనానికి అయిన ఖర్చును లెక్కగట్టి.. తన సొంత డబ్బుల నుండి ప్రభుత్వ ఖజానాకు జమ చేయించారు. “ప్రజాధనం ప్రజలకే చెందాలి, నా కుటుంబానికి కాదు” అని స్పష్టం చేశారు. ఆయన చనిపోయే సమయానికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు, జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. ఆ స్థాయి నిజాయితీ ఆయనది.

​ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలం తక్కువైనా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేసే అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ​ విజయవాడ వద్ద కృష్ణా నదిపై పాత ఆనకట్ట కొట్టుకుపోయినప్పుడు, “కృష్ణా బ్యారేజ్” నిర్మాణం తో రాయలసీమ, కోస్తా జిల్లాలను కరువు నుండి రక్షించడానికి సరికొత్త బ్యారేజ్ నిర్మాణానికి ఆయనే శంకుస్థాపన చేశారు. రాయలసీమ ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ స్థాపనకు ఆయనే శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కాగానే ఆయన తీసుకున్న తొలి నిర్ణయాలలో ముఖ్యమైనది…. జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను, స్వాతంత్ర్య సమరయోధులను విడుదల చేయడం.

ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండి శంకుస్థాపన చేసిన “కృష్ణా బ్యారేజ్” నిర్మాణం 1957 నాటికి పూర్తయింది. దురదృష్టవశాత్తూ అదే ఏడాది (1957 మే 20న) టంగుటూరి ప్రకాశం కన్నుమూశారు.
​ఆ తర్వాత బ్యారేజ్ ప్రారంభోత్సవ సమయంలో, నవ్యాంధ్ర నిర్మాణానికి ఆయన చేసిన కృషికి మరియు ఆ ప్రాజెక్టు కోసం ఆయన పడిన తపనకు గుర్తింపుగా.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆ బ్యారేజీకి “ప్రకాశం బ్యారేజ్” అని నామకరణం చేశారు.
​
నేటి రాజకీయాల్లో విలువలు క్షీణిస్తున్న తరుణంలో, టంగుటూరి ప్రకాశం జీవితం ప్రస్తుత నాయకులకు ఎంతైనా ఆదర్శనీయం. కోట్లు సంపాదించే న్యాయవాద వృత్తిని వదిలి, దేశం కోసం సర్వం త్యాగం చేసి, కటిక పేదరికాన్ని అనుభవించిన ప్రకాశం గారి జీవితం నుండి నేటి నేతలు త్యాగం అంటే ఏంటో నేర్చుకోవాలి. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి శక్తినైనా ఎదిరించగల ధైర్యం నేటి రాజకీయాల్లో అవసరం. ప్రజల ప్రయోజనాల కోసం సొంత పార్టీ అధిష్ఠానాన్ని సైతం ఎదిరించిన చరిత్ర ఆయనది. అందుకే అయ్యదేవర కాళేశ్వరరావు ప్రకాశం గురించి చెబుతూ గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం అన్నారు.

​ముగింపు: ధనం పోయినా వ్యక్తిత్వం కోల్పోకూడదు అని చాటి, అలాగే బ్రతికిన మేరు నగ ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు. తెలుగు జాతి ఉన్నంతవరకు కృష్ణా నది రూపంలో, ప్రకాశం బ్యారేజ్ సాక్షిగా ఆయన కీర్తి సజీవంగానే ఉంటుంది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ ఆంధ్రకేసరి స్మృతికి శతకోటి వినమ్ర నివాళులు….

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading