Download App

బండి భగీరథ అరెస్ట్…. చట్టం ముందు అందరూ సమానులేనా…

మే 17, 2026 By Suresh Thota
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్…. "రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానమే. కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా ప్రతి పౌరుడికి న్యాయం అందేలా చూడడమే నిజమైన ప్రజాస్వామ్యం." ఇది మనకు రాజ్యాంగంలో అందరూ సమానమే అని రాసారు. ఒక దేశపు చట్టం ఎంత శక్తివంతమైనదో, అది సమాజంలోని...
బండి భగీరథ అరెస్ట్…. చట్టం ముందు అందరూ సమానులేనా…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్…. “రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానమే. కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా ప్రతి పౌరుడికి న్యాయం అందేలా చూడడమే నిజమైన ప్రజాస్వామ్యం.” ఇది మనకు రాజ్యాంగంలో అందరూ సమానమే అని రాసారు.

ఒక దేశపు చట్టం ఎంత శక్తివంతమైనదో, అది సమాజంలోని అత్యంత బలహీనుడికి ఇచ్చే భరోసాను బట్టి తెలుస్తుంది. అలాగే ఆ చట్టం ఎంత నిష్పాక్షికమైనదో, అది దేశాన్ని ఏలే పాలకుల కుటుంబాల వైపు చూసే చూపును బట్టి అర్థమవుతుంది. తెలంగాణ సమాజంలో గత వారం రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది…. ఇదికేవలం ఒక నేరపూరిత ఆరోపణ మాత్రమే కాదు, అది ఈ దేశంలో చట్టం ప్రయాణించే వేగాన్ని, పాలకుల నైతిక విలువలను ప్రశ్నించే ఒక తీవ్రమైన సామాజిక సంక్షోభం.

బండి భగీరథ అరెస్ట్…. చట్టం ముందు అందరూ సమానులేనా…

ఈ వ్యవహారం లో బండి సాయి భగీరథ అపరాధి నా, నిరపరాదినా అనేది కోర్టులు తేలుస్తాయి. కానీ మే 8న ప్రారంభమైన ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ, మే 16 శనివారం నాడు నిందితుడి లొంగుబాటు వరకు సాగిన తీరు చట్టం అమలు పై అనేక సందేహాలను, ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించారంటూ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలంగా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఫాంహౌస్‌లో నిర్బంధించి వేధించారని, ఈ మానసిక క్షోభని తమ కూతురు భరించలేక పోతుందని, అంటూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేశాయి.

అయితే చట్టం ఇక్కడే తన ద్విముఖ స్వభావాన్ని ప్రదర్శించింది. సాధారణ పౌరులపై “పోక్సో” చట్టం కింద ఆరోపణలు వస్తే, క్షణాల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకునే పోలీసు అధికారులు…. ఒక కేంద్ర మంత్రి కుమారుడి విషయంలో మాత్రం ఆచి తూచి అడుగులు వేశారు. మే 8, 9 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన భద్రతా ఏర్పాట్లను కారణంగా చూపుతూ, ఈ కేసు ప్రాథమిక విచారణలో పోలీసులు ప్రదర్శించిన అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. బాధితురాలి కుటుంబం స్టేషన్‌లో గంటల తరబడి వేచి చూడాల్సి రావడం, చట్టం అధికార పీఠాల ముందు మోకరిల్లుతుందా అనే అనుమానాలకు తావిచ్చింది.

మరోవైపు, ఈ కేసు వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందంటూ ఇటు నిందితుడి వర్గం కౌంటర్ అటాక్ ప్రారంభించింది. పోక్సో కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే సాయి భగీరథ కరీంనగర్ పోలీసులకు కౌంటర్ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఒక అమ్మాయి ద్వారా తనను హనీట్రాప్ చేశారని, పెళ్లి పేరుతో ఒత్తిడి తెచ్చి ఇప్పటికే ₹50,000 వసూలు చేశారని, ఇప్పుడు ఏకంగా ₹5 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని సాయి భగీరథ ఆరోపించారు. నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉన్నప్పటికీ, కేసు నమోదైన వెంటనే నిందితుడి లీగల్ టీమ్ ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం చట్టపరమైన వ్యూహంలో భాగంగానే కనిపిస్తుంది.

బండి భగీరథ అరెస్ట్…. చట్టం ముందు అందరూ సమానులేనా…

కానీ ఈ మొత్తం వ్యవహారంలో అందరినీ ఆలోచనలో పడేసే అంశం ఏమిటంటే… రాజకీయ నాయకుల ద్వంద్వ ప్రమాణాలు. మే 10న హైదరాబాద్ వేదికగా “ప్రధాని మోదీ” సమక్షంలో బండి సంజయ్ అదే వేదిక పై ధర్మం గురించి, పురాణాల గురించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. కరీంనగర్ హనుమాన్ యాత్రలో న్యాయం, అన్యాయాల గురించి మాట్లాడారు. వేదికలపై నీతులు చెప్పే ఈ నాయకులు, తమ స్వంత కుటుంబ విషయానికి వచ్చేసరికి చట్టం నుండి తప్పించు కోవడానికి న్యాయపరమైన లొసుగులు, లోపాలు (Legal Loopholes) వెతకడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న సమాజం నుంచి వేలు ఎత్తిచూపుతుంది.

రోజూ టీవీల్లో విలువల గురించి మాట్లాడే ఒక కేంద్ర మంత్రి, చట్టానికి గౌరవం ఇచ్చి తన కుమారుడిని మొదటి రోజే పోలీసుల ముందుకు ఎందుకు హాజరు పరచలేదు. దీనికి సమాధానంగా, “తమ వద్ద ఉన్న ఆధారాలు చూసి ఈ కేసు నిలబడదని, బెయిల్ వస్తుందని న్యాయ నిపుణులు సలహా ఇచ్చారు, అందుకే కోర్టు ఆర్డర్స్ కోసం వేచి చూశాం” అని మంత్రి బండి సంజయ్, ఆయన లీగల్ టీమ్ సమర్థించు కోవచ్చు. ఒక తండ్రిగా తన కొడుకును రక్షించుకోవడానికి న్యాయపరమైన అన్ని హక్కులను వాడుకోవడం తప్పు కాకపోవచ్చు, కానీ దేశంలో చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యత గల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి ఉన్న వ్యక్తికి, ఈ తాత్సారం నైతికంగా అర్హత ఇస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

చివరకు మే 15 వ తేదీ శుక్రవారం తెలంగాణ హైకోర్టు సాయి భగీరథ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం మరియు తాత్కాలిక ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించడంతో కథ మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు (LOC) జారీ చేసి, 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ నివాసం, కరీంనగర్ స్వగృహాలపై పోలీసుల నిఘా తీవ్రమైంది.

అరెస్ట్ తప్పనిసరి అనే తరుణంలో, మే 16 శనివారం సాయంత్రం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాయి భగీరథ తన న్యాయవాదులతో కలిసి సైబరాబాద్ పోలీసుల ముందు లొంగిపోయారు అని బండి సంజయ్ వర్గం చెబుతుంది. “చట్టంపై గౌరవంతో మా బిడ్డను మేమే స్వచ్ఛందంగా అప్పగించాం” అని చెబుతుంటే, ఒక కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉంటే పట్టుకోలేకపోయారనే నింద పడకుండా ఉండేందుకు.. పోలీసులు తామే పక్కా స్కెచ్‌తో చేజ్ చేసి అరెస్ట్ చేశామని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వెతికి పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారనే పేరు రాకుండా, చట్టాన్ని గౌరవించి లొంగిపోయాం అని చెప్పుకోవడం ద్వారా పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని బండి సంజయ్ బావిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ , బండి సాయి భగీరథ అరెస్ట్ అయితే జరిగింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మరో విధంగా స్పందిస్తున్నారు. ఈ పని పోలీసులు లుకౌట్ నోటీసులు ఇవ్వకముందు చేయాలి తప్ప, తప్పించుకునే దారి లేని స్థితికి వచ్చిన తర్వాత ఈ మాటలు వ్యర్థం, అని అంటున్నారు.

ఈ ఉదంతం భారతీయ రాజకీయాల్లో పదవి-నైతికత అనే పాత చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఒక సామాన్యుడిపై ఇలాంటి ఆరోపణ వస్తే సమాజం, చట్టం స్పందించే తీరుకు.. ఒక పాలకుడి కొడుకు విషయంలో జరిగిన ఈ ఉదంతం ప్రజాస్వామ్య స్ఫూర్తిని గాయపరుస్తోంది. ఒక కేంద్ర మంత్రిగా “బండి సంజయ్” ఈ పదవిలో కొనసాగడానికి అర్హుడేనా…? చట్టాన్ని అమలు చేయాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి, తన కుటుంబంపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆదర్శంగా నిలవకుండా వారం రోజుల పాటు కాలయాపన చేయడం సమంజసమేనా…..? అనే ప్రశ్నలకు సోషల్ మీడియా వేదికైంది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

నిందితుడు పోలీసుల కస్టడీలోకి వెళ్లాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పాలకులు చెప్తున్న మాటలు నిజం కావాలి. బాధితురాలు మైనర్ అని తేలితే పోక్సో చట్టం ఎంత కఠినంగా అమలు అవుతుందో , ఒకవేళ నిందితుడు వాదిస్తున్నట్టుగా, ఇది పొలిటికల్ హనీట్రాప్ అయితే ఆ కోణంలోనూ నిజాలు బయటకు రావాలి. కానీ ఈ ఎనిమిది రోజుల హైడ్రామా సమాజానికి ఇచ్చిన సందేశం ఒక్కటే – అధికార పీఠాలపై ఉన్నప్పుడు చెప్పే నీతులు, ఆ అధికారపు నీడ సొంత ఇళ్లను తాకినప్పుడు కరిగిపోకూడదు. న్యాయం జరగడమే కాదు, అది జరుగుతున్నట్టు ప్రజలకు కనిపించాలి. అప్పుడే చట్టంపై సామాన్యుడికి నమ్మకం నిలుస్తుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading