“ఒక్కో ఇంట్లో వందల దొంగ ఓట్లు!”: కేటీఆర్ సంచలన ఆరోపణలు
October 13, 2025 Published by Srinivas

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి మొదలైంది. నామినేషన్ల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభమై అక్టోబర్ 21తో ముగుస్తుంది. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నేతలు దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆయన ఆరోపించారు. “ఒక్కో ఇంట్లో 250 ఓట్లు… 180 ఓట్లు… 90 ఓట్లు… 80 ఓట్లు ఇలా అనేక అడ్రస్‌లలో వందల ఓట్లు నమోదు అయ్యాయి. మేము వెరిఫికేషన్ కోసం ఒక ఇంటికి వెళ్లినప్పుడు, ఆ ఇంటి యజమాని ‘ఈ పేర్లు ఎవరివో నాకు తెలియదు… ఇవన్నీ దొంగ ఓట్లు’ అని స్పష్టంగా చెప్పారు” అని కేటీఆర్ వెల్లడించారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో దొంగ ఓట్ల నమోదు చేయించిందని ఆయన ఆరోపించారు. “మొత్తం 14 నుంచి 15 వేల వరకు దొంగ ఓట్లు చేర్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ వివరాలన్నీ, ఆధారాలు మేము సేకరించి ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)కి ఫిర్యాదు చేసాం” అని కేటీఆర్ తెలిపారు.
ఉపఎన్నిక వాతావరణం మరింత వేడెక్కుతున్న ఈ సమయంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ వర్గాలు దీనిపై ఇప్పటివరకు స్పందించకపోయినా, రాబోయే రోజుల్లో ఈ ఆరోపణలపై వాదోపవాదాలు నెలకొనే అవకాశం ఉంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు అక్టోబర్ 21తో ముగిసిన తర్వాత, ఉపఎన్నికల హోరు మరింత వేగం పొందే అవకాశం ఉంది.
