యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయం: రాజగోపాల్ రెడ్డి
September 18, 2025 Published by Rahul N

తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి యువతను మోసం చేసిందని ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, “ప్రభుత్వం వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు నమ్మారు. కానీ ఆ హామీ అమలు కాలేదు. అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వని ఈ ప్రభుత్వం నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో మిగిలిపోతుంది” అని వ్యాఖ్యానించారు.
నిరుద్యోగులను గాలికి వదిలేయడం సరైంది కాదని, వారికి దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని గుర్తు చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం చేస్తున్న నిరుద్యోగుల డిమాండ్ పూర్తిగా న్యాయమైనదేనని పునరుద్ఘాటించారు.
అంతేకాకుండా, “నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయం. నిరుద్యోగుల నిరసనలను చిన్నచూపు చూడకండి” అని సొంత పార్టీ ప్రభుత్వానికే రాజగోపాల్ రెడ్డి ధీటైన హెచ్చరికలు జారీ చేశారు.
గ్రూప్-1 అవకతవకలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన, యువత పక్షాన ఎల్లప్పుడూ నిలుస్తానని స్పష్టం చేశారు. ఏ సమస్య ఎదురైనా దానిని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
మాజీ సీఎం కేసీఆర్‌ను గద్దె దించడంలో యువత పోషించిన కీలక పాత్రను గుర్తుచేసిన రాజగోపాల్ రెడ్డి, “అమరవీరుల సాక్షిగా నిరుద్యోగులకు అండగా ఉంటాను. వారి సమస్యలు వినేందుకు నేనే వస్తాను. వారిని వదిలేస్తే ఈ ప్రభుత్వ భవిష్యత్తు కూడా సురక్షితం కాదు” అని వ్యాఖ్యానించారు.
