సినిమా వార్తలు

పిల్లలను – పెద్దలను అలరించడానికి సిద్ధమైన భారతీయ అనిమేషన్ చిత్రం ‘కికీ & కోకో’

Published by
Srinivas

ఇటీవల అనిమేషన్ చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తున్నాయి. ముఖ్యంగా బాలల కోసం సినిమాలు నిర్మించడానికి పెద్దగా ముందుకు రాకపోయినా, వారికి అర్థమయ్యేలా వినోదాత్మకంగా చిత్రాలు అందిస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా దక్కుతుందనే విషయం పలుమార్లు రుజువైంది. ఇండియన్ స్క్రీన్‌పై ‘లయన్ కింగ్’, ‘అలాద్దిన్’ వంటి కొన్ని అనిమేషన్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. అంతేకాదు, ఇటీవల జూలైలో విడుదలైన ‘మహా అవతార్ నరసింహ’ అనిమేషన్ చిత్రం పిల్లలు, పెద్దలను విశేషంగా ఆకట్టుకొని రికార్డు స్థాయి వసూళ్లతో ఘన విజయం సాధించింది. ఈ తరుణంలో ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే మరో భారతీయ అనిమేషన్ మూవీ “కికీ & కోకో” త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుండగా, భారత సాంకేతిక నిపుణులే పూర్తిగా రూపొందించిన ఈ చిత్రాన్ని పీ. నారాయణన్ తొలిసారిగా విభిన్న శైలిలో తెరకెక్కించారు.

దర్శకుడు పీ. నారాయణన్ మాట్లాడుతూ, “ఈ చిత్రం పిల్లలకే పరిమితం కాదు. పెద్దల్లోనూ చిన్నప్పటి మధురానుభూతులను గుర్తు చేసే మాయ శక్తి ఇందులో ఉంది. చిన్నారుల వినోదం, విద్యకు కొత్త నిర్వచనం చూపించే వినూత్న ప్రయత్నం ఇది. కికీ అనే ప్రేమికమైన పెంపుడు జంతువు, కోకో అనే చిన్నారి మధ్య ఉన్న అపూర్వమైన బంధాన్ని ఈ చిత్రం చెబుతుంది. ప్రేమ, జీవిత పాఠాలు, అద్భుత భావోద్వేగ క్షణాలతో నిండిన వారి ప్రయాణం అన్ని వయసుల ప్రేక్షకుల హృదయాలను తాకేలా తీర్చిదిద్దాం. అనిమేషన్ ఏ వయసు వారినైనా అలరించే మేజిక్. ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన మా తొలి ప్రయత్నమే ‘కికీ & కోకో’. నేటి పిల్లలకు ప్రభావవంతమైన విద్యా కథలు అత్యవసరం. స్నేహం, ప్రేమ, ఒక చిన్నారి తన పెంపుడు జంతువుతో పంచుకునే మాంత్రిక బంధం గురించి చెప్పే ఈ కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మా గౌరవంగా భావిస్తున్నాము. హాలీవుడ్ మాత్రమే అనిమేషన్ చిత్రాలు తీయగలరు అనుకునే వారికీ, భారతీయ సినీ రంగం కూడా ఈ జోనర్‌లో ప్రపంచ స్థాయికి సిద్ధంగా ఉందని మా చిత్రం చెబుతుంది” అని తెలిపారు.

ఇనికా ప్రొడక్షన్స్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ జి.యం. కార్తికేయన్ మాట్లాడుతూ, “కికీ & కోకో ఒక సినిమా మాత్రమే కాదు. ఇది స్నేహం, ప్రేమ, కథల ద్వారా పిల్లలు నేర్చుకునే విలువైన పాఠాల వేదిక. ఈ మాంత్రిక ప్రయాణాన్ని ప్రేక్షకులు హృదయపూర్వకంగా స్వాగతించాలని కోరుకుంటున్నాం. కికీ & కోకోను థియేటర్లలో చూసి ఆనందించాలనే మా అభిలాష. ఇందులో ప్రత్యేక మెర్చండైజ్, విద్యా రూపకల్పనలు కూడా ఉంటాయి. యావత్ కుటుంబం కలిసి చూసి చిరస్థాయిగా గుర్తుంచుకునే అనుభూతి అందించే చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది” అని తెలిపారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.