సాధారణంగా సినిమా ఫస్ట్ లుక్స్, టీజర్ల విడుదల తేదీలను ముందుగానే ఖరారు చేస్తారు. కానీ హీరో నాని రాబోయే చిత్రం ‘ప్యారడైజ్’ విషయంలో ఆ షెడ్యూల్ మారినట్లు తెలుస్తోంది. లెక్కప్రకారం ఈపాటికి ఫస్ట్ లుక్ విడుదల కావాలి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కూడా. అయితే చివరి నిమిషంలో ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసేసారంట.
వెనక్కి తగ్గిన నాని ?
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నిర్ణయం నానిదే. కారణం – విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘కింగ్డమ్’ విడుదల. సోషల్ మీడియాలో నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య తరచూ మాటల యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ సినిమా విడుదల సమయంలో ‘ప్యారడైజ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే అనవసరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని నాని భావించాడట. అందుకే వివాదాలకు తావు లేకుండా కొద్దిరోజులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
భారీ స్థాయిలో రూపొందుతున్న ‘ప్యారడైజ్’
‘ప్యారడైజ్’ చిత్రాన్ని విజయవంతమైన ‘దసరా’ కాంబినేషన్ – నాని మరియు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల – మళ్లీ కలసి చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాన్-వరల్డ్ మూవీని 2026 మార్చి 26న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, మరో వారం రోజుల్లో ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉంది.