
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్రం ప్రారంభం నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి అప్‌డేట్ ఆ అంచనాలను మరింతగా పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం భారతీయ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’ అగ్రస్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. అభిమానుల కోలాహలంతో వేదిక మార్మోగిపోయింది. వేడుకలో విడుదల చేసిన ‘ఓజీ’ ట్రైలర్ అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ – “సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్స్‌తో ఇలాంటి వేడుకలకు నేనెప్పుడూ రాలేదు. దర్శకుడు సుజీత్ వల్ల, అభిమానుల కోసం తొలిసారి ఇలా సినిమా కాస్ట్యూమ్స్‌తో వచ్చాను. ‘వాషి యో వాషి’ అనేది జపనీస్ హైకూ. ‘నువ్వు అందనంత ఎత్తులో ఉన్నావు.. నిన్ను నేలకు దించుతాను’ అని విలన్‌కి హీరో చెప్పే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఈ పాట ద్వారా ఓజీతో పోటీ పడితే మరణం ఎంత భయంకరమో చూపించాం.

ఇమ్రాన్ హష్మీ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ‘జలక్ తిక లాజ’తో అప్పట్లో అలరించారు. అద్భుతమైన నటుడు.
దర్శకుడు సుజీత్ నా వీరాభిమాని. జానీ సినిమా సమయంలో తాను హెడ్‌బ్యాండ్ కట్టుకొని తిరిగానని చెప్పాడు. సినిమా మీద ఉన్న ఆ ప్యాషన్‌నే అతన్ని ఇక్కడిదాకా తీసుకువచ్చింది. సాహో సినిమా తర్వాత త్రివిక్రమ్, దానయ్య ద్వారా సుజీత్ నాకు పరిచయం అయ్యాడు. సుజీత్ కథ సింపుల్‌గా చెబుతాడు కానీ సినిమాగా తీర్చిదిద్దే విధానం మాత్రం అద్భుతం.
నిజానికి ఈ సినిమా హీరో నేను కాదు. ఈ సినిమాకి ఇద్దరు స్టార్‌లు ఉన్నారు. మొదటివాడు దర్శకుడు సుజీత్, రెండోది సంగీత దర్శకుడు తమన్. వీరిద్దరూ ఈ సినిమా కోసం పిచ్చిగా పని చేశారు. వాళ్ల మాయలోకి నేను కూడా లాగబడ్డాను. ఈ సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులను అలరిస్తుంది.” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
