Download App

హోలీ పండుగనాడే అరుదైన చంద్ర గ్రహణం…

మార్చి 1, 2026 By Suresh Thota
హోలీ రోజున అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. 2026 మార్చి 3న ‘బ్లడ్ మూన్’తో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఖగోళ ప్రేమికులకు, ఆధ్యాత్మిక భక్తులకు ఒక అరుదైన సంఘటన ఎదురుకానుంది. రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హోలీ రోజునే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మంగళవారం ఏర్పడే ఈ గ్రహణ...
హోలీ పండుగనాడే అరుదైన చంద్ర గ్రహణం…

హోలీ రోజున అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. 2026 మార్చి 3న ‘బ్లడ్ మూన్’తో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఖగోళ ప్రేమికులకు, ఆధ్యాత్మిక భక్తులకు ఒక అరుదైన సంఘటన ఎదురుకానుంది. రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హోలీ రోజునే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మంగళవారం ఏర్పడే ఈ గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లి ఎరుపు రంగులో కనిపించే అరుదైన దృశ్యం ఏర్పడుతుంది. ఈ కారణంగా దీనిని శాస్త్రవేత్తలు Blood Moon అని పిలుస్తారు.

ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. అయితే చంద్రోదయం తర్వాతే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. గ్రహణ మధ్యాహ్నం 03:20 నిమిషాలకు ప్రారంభమై, సాయంత్రం 06:48 నిమిషాలకు ముగుస్తుంది. ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఈ గ్రహణం అత్యంత స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది… సంపూర్ణ చంద్ర గ్రహణం సమయంలో భూమి సూర్యుడి కాంతిని పూర్తిగా అడ్డుకుంటుంది. అయితే భూమి వాతావరణం ద్వారా వంగిన ఎరుపు కాంతి మాత్రమే చంద్రుడిపై పడుతుంది. దాంతో చంద్రుడు ముదురు ఎరుపు లేదా రాగి రంగులో కనిపిస్తాడు. ఈ ప్రత్యేక దృశ్యాన్నే బ్లడ్ మూన్ గా పిలుస్తారు.

భారత సంప్రదాయం ప్రకారం గ్రహణానికి సుమారు 9 గంటల ముందు “సూతక కాలం” అని అంటారు . ఈ సమయంలో భక్తులు కొన్ని నియమాలు పాటించడం అనాదిగా వస్తుంది. సూతక సమయంలో ఆహారం తీసుకోవద్దని పండితులు సూచిస్తారు. ఇంట్లో ఉన్న పదార్థాలపై దర్భలు ఉంచడం ద్వారా గ్రహణ ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. గ్రహణ సమయంలో సాధ్యమైనంత వరకు నిద్రపోకూడదు.

గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పదునైన వస్తువులను ఉపయోగించ కూడదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. సింహ రాశి వారు, అందులోని పుబ్బ నక్షత్రం వారు గ్రహణం చూడరాదు అని, గ్రహణ సమయంలో జపం, ధ్యానం చేయడం శ్రేయస్కరమని, ముఖ్యంగా “ఓం కేతవే నమః” లేదా “మహా మృత్యుంజయ మంత్రం” జపించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని, అప్పుడు వండుకుని భుజించవలెను అని అంటున్నారు.

హోలీ పండుగ ఎప్పుడూ ఫాల్గుణ మాసపు పౌర్ణమి రోజునే జరుపుకుంటారు. చంద్రగ్రహణం కూడా పౌర్ణమి రోజునే సంభవిస్తుంది. అందువల్ల కొన్నిసార్లు ఈ రెండు ఒకే రోజున రావడం ఖగోళ పరంగా సాధ్యమే. అయితే భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడే గ్రహణం సంభవిస్తుంది.

హోలీ పండుగ వేడుకలపై గ్రహణ ప్రభావం ఉంటుందని, గ్రహణం ఉన్న రోజుల్లో కొన్ని ఆచారాలను పాటించడం మంచిదని, గ్రహణ సమయం పూర్తయ్యే వరకు హోలీ వేడుకలను ప్రారంభించకుండా, గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి పండుగ కార్యక్రమాలు ప్రారంభించడం శాస్త్రోక్తంగా మంచిదని పండితులు సూచన.

హోలీ పండుగ పురాణ నేపథ్యం

హోలీ పండుగకు సంబంధించిన ప్రధాన కథనం హిరణ్య కశిపుడు , అతని కుమారుడు ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుని సోదరి హోళికా కథతో ముడిపడి ఉంది.

పురాణాల ప్రకారం, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశిపుడు పలు ప్రయత్నాలు చేశాడు. చివరకు హోళికా అనే తన సోదరిని అగ్నిలో కూర్చోబెట్టి ప్రహ్లాదుడిని కాల్చివేయాలని యత్నించాడు. అయితే విష్ణుభక్తి కారణంగా ప్రహ్లాదుడు రక్షించబడి, హోళికా మంటల్లో కాలిపోయింది. ఈ సంఘటనను గుర్తు చేసుకునే సందర్భంగా హోలీకి ముందు రోజు హోలికా దహనం నిర్వహిస్తారు. తర్వాత రోజు ప్రజలు రంగులు చల్లుకుని ఆనందంగా పండుగ జరుపుకుంటారు.

హోలీ పండుగ గురించి మరో కథ కూడా వాడుకలో ఉంది. పురాణాల ప్రకారం, బాలకృష్ణుడు తన చర్మం నలుపు (నీలం) రంగులో ఉందని, రాధమ్మ మాత్రం చాలా తెల్లగా ఉందని తన తల్లి యశోదతో అమాయకంగా ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు యశోదమ్మ నవ్వుతూ, “నీకు నచ్చిన రంగును తీసుకువెళ్లి రాధ ముఖానికి పూస్తే అప్పుడు మీ ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు ” అని చెబుతుంది. కృష్ణుడు అలాగే వెళ్లి రాధాదేవికి, గోపికలకు నల్ల రంగు పూస్తాడు. అలా మొదలైన ఈ సరదా ఆట కాలక్రమేణా ‘హోలీ’ పండుగగా మారింది.

రంగులు పూసినప్పుడు అందరూ ఒకేలా కనిపిస్తారు. ధనిక,పేద, కుల,మత భేదాలు లేకుండా అందరినీ కలుపుకుపోయే తత్వమే దీని వెనుక ఉన్న అసలు విషయం. ఇది మధుర, బృందావనం లలో 16 రోజుల పండుగ గా జరుపుకుంటారు.

సారాంశం…

రంగుల పండుగ హోలీ రోజునే సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించడం ఒక అరుదైన ఖగోళ సంఘటనగా భావిస్తున్నారు. ఖగోళ పరంగా ఇది సహజ ప్రక్రియ అయినప్పటికీ, భారతీయ సంప్రదాయంలో దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఉంది.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading