
సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుండి జాలు వారిన… అమ్మ మీద పాట మనసు తో వినాలి.
“ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం.
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం..
అమ్మేగా.. అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న బాషకి..
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి..
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం..
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం..
అవతార మూర్తి అయినా అనువంతే పుడతాడు..
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు”..
ఎవరైనా రుణం తీర్చుకోలేనిది, వెల కట్టలేనిది ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే.
ప్రపంచంలో అమ్మ అనే పదానికి మించిన తారక మంత్రం ఉందా… ఆ మాతృమూర్తికి మించిన తీర్థ క్షేత్రం మరొకటి లేదు. మనం ఎన్ని కోవెలలు తిరిగినా, ఎన్ని నదుల్లో మునిగినా దొరకని శాంతి.. అమ్మ ఒడిలో తలవాల్చగానే లభిస్తుంది. ఈ మాతృ దినోత్సవం వేళ, ఆ త్యాగమయిని ఒక్కసారి మనసారా స్మరించుకుందాం.
మనం ఈ భూమి మీద అడుగుపెట్టకముందే, తన రక్తాన్ని పాలుగా మార్చి మనకు ప్రాణం పోసింది అమ్మ. మన ఊపిరి కోసం తన ఊపిరిని పణంగా పెట్టి, పురిటి నొప్పులనే మరణపు అంచులను తాకి మనల్ని ఈ లోకానికి పరిచయం చేసింది అమ్మ. మనం ప్రయోజకులుగా ఎదగాలని తను అరిగిపోతుంది. మన ఆకలి తీర్చడం కోసం తన ఆకలిని అణుచుకుంటుంది అమ్మ, తన పిల్లలు వేసుకున్న బట్టలు చూసి తను వేసుకున్నట్లుగా పొంగుపోతుంది. కాని, ఆ త్యాగాలేవీ తను ఎప్పుడూ మనకు చెప్పదు. ఆ త్యాగాలకు. విలువ కట్టే షరాబు లేడు ఈ భూమి మీద, తన చిరునవ్వు వెనుక ఉన్న శ్రమను మనం గుర్తించలేనంతగా తను మనల్ని ప్రేమిస్తుంది.
వయసు పెరిగేకొద్దీ మన ప్రపంచం మారిపోతుంది. స్నేహితులు, కెరీర్, సంపాదన, కుటుంబం.. ఇలా బాధ్యతల చక్రంలో పడి అమ్మను ఒక “అవసరం” గానో, లేదా ఇంటి లో ఉండే ఒక “జ్ఞాపకం” గానో మార్చేసుకుంటున్నాం. ఫోన్ చేస్తే రెండు నిమిషాలు మాట్లాడటానికి, సమయం లేని ధన వ్యామోహంలో చిక్కుకున్న బిడ్డలెందరో….. కానీ అమ్మ మాత్రం.. మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా “నా బిడ్డ తిన్నాడో లేదో” అని నిరంతరం తపించే, బిడ్డ కోసం తహ తహ లాడే ఏకైక ప్రాణం అమ్మే. ప్రపంచమంతా మనల్ని తప్పు పట్టినా, మన వెంట నిలిచే అమృత మూర్తి అమ్మ.
తల్లి లేని వాడికి తెలుస్తుంది తల్లి విలువ, ఆస్తిపాస్తులు, హోదాలు వస్తుంటాయి, పోతుంటాయి వాటిని తిరిగి సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. సంపాదించుకోవచ్చు కూడా, కాని అమ్మ ఉన్నప్పుడే ఆమె నిస్వార్థమైన ప్రేమ దక్కుతుంది. అది అనుభవించడం తల్లి ఉన్నవాడికి దొరికిన అదృష్టం, ఆమెను గౌరవించుకోవడం మనకు దక్కిన అతిపెద్ద వరం. అమ్మ ముఖం మీద వార్ధక్యం వల్ల వచ్చిన ముడతల్లో మన ఎదుగుదల ఉంది, వారి వృద్ధాప్యం మనకు బరువు కాదు, వార్ధక్యం అంటే శారీరకంగా బలహీనపడటం, అవయవాలు పనితీరు తగ్గడం, లాంటి వాటి వల్ల, ముసలితనం వల్ల వారిని అక్కున చేర్చుకుని చూడటం మన ధర్మం, బాధ్యత. అందుకే బాధ్యత తో వ్యవహరించి వారిని వృద్ధాశ్రమంలో జేర్చకుండా అక్కున జేర్చుకుని, వారికి స్వాంతన చేకూరుద్దాం.
ఒక్క క్షణం ఆలోచించండి. తల్లి లేని జీవితాన్ని ఒక్కసారి ఊహించుకోండి. గుండె భారమైపోతుంది కదూ… ఇంకెందుకు ఆలస్యం… ఈ రోజే అమ్మ దగ్గరకు వెళ్ళండి. ఏ పనులూ లేవని కాదు, ఏ పనులూ అమ్మ కంటే ముఖ్యం కాదని గుర్తుంచుకోండి. మీ అమ్మ ముందు మోకరిల్లి, ఆమె పాదాలను మీ కన్నీటితో కడిగి, ఒక్కసారి గుండెలకు హత్తుకోండి. ఆ క్షణం ఆమె కళ్లలో కురిసే ఆనందభాష్పాలు.. కోటి పుణ్యక్షేత్రాల దర్శనంతో సమానం.
ముగింపు: అమ్మ పాదాల చెంత స్వర్గం ఉంటుంది. ఆ పాదాలను కాసేపు ఒత్తండి… స్వర్గాన్ని అమ్మ బతికున్నప్పుడే ఆస్వాదించండి. కనీసం వారానికి ఒక్కసారైనా అమ్మతో భోజనం చేయండి. ఆ ప్రశాంతతను అనుభవించండి… మాతృ మూర్తులు అందరికీ మరొకసారి “మాతృ దినోత్సవ శుభాకాంక్షలు”.
