జీహెచ్ఎంసీ: ఇక నుండి 12 జోన్లు, 60 సర్కిల్స్… విస్తరణకు ఉత్తర్వులు
డిసెంబర్ 26, 2025 Published by Srinivas

హైదరాబాద్ నగర పాలన మరింత సమర్థవంతంగా మారేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12 జోన్లుగా, 30 సర్కిల్స్‌ను 60 సర్కిల్స్‌గా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విస్తరణలో భాగంగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్‌ను కొత్త జోన్లుగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో నగర పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
కొత్తగా ఏర్పాటుకానున్న జోనల్ కార్యాలయాలు సంబంధిత సర్కిల్ ఆఫీసుల్లో ఏర్పాటు చేయబడతాయి. అలాగే, వార్డు కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ప్రారంభించనున్నారు. ఈ కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల నుంచే పరిపాలన సాగనుండటంతో, ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయి.
ఈ మార్పులతో పౌరసేవల నాణ్యత పెరగడమే కాకుండా, ఫీల్డ్ స్థాయిలో సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని జీహెచ్ఎంసీ వర్గాలు వెల్లడించాయి. నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, పట్టణ మౌలిక సదుపాయాల నిర్వహణలో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలవనుంది.
