Download App

దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ళ కేసులో… ఉగ్రవాదులకు ఉరిశిక్ష…

ఫిబ్రవరి 21, 2026 • By Suresh Thota
దిల్‌సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు నుంచి ఉరిశిక్ష వరకు పూర్వాపరాలు… హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన ఈ కేసు 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం జరిగింది. ఎప్పటిలాగే నిత్యం జనంతోరద్దీగా ఉంటూ కళకళలాడే దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలో సాయంత్రం వేళ… ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ తో...
దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ళ కేసులో… ఉగ్రవాదులకు ఉరిశిక్ష…

దిల్‌సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు నుంచి ఉరిశిక్ష వరకు పూర్వాపరాలు…

హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన ఈ కేసు 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం జరిగింది. ఎప్పటిలాగే నిత్యం జనంతోరద్దీగా ఉంటూ కళకళలాడే దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలో సాయంత్రం వేళ… ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ తో క్షణాల్లోనే భయానక, బీతావహమైన వాతావరణం నెలకొంది. బస్ స్టాప్ మరియు మార్కెట్ ప్రాంతాల్లో వరుసగా జరిగిన రెండు భారీ పేలుళ్లు నగరాన్ని షాక్‌కు గురిచేశాయి. ఆ ఘటనలో 18 మంది మృతి చెందగా, 130 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తర్వాతి కొన్ని గంటల్లోనే ఇది సాధారణ పేలుడు కాదని, ఒక ప్రణాళికతో చేసిన ఉగ్రదాడి అని పోలీసులు నిర్ధారించారు.

ఈ కేసు దర్యాప్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ (NIA)కు అప్పగించబడింది. దర్యాప్తులో ఇది ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్రగా బయటపడింది.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు ముందుగానే ఈ ప్రాంతాన్ని రెక్కీ నిర్వహించారు. జనసంచారం ఎక్కువగా ఉండే సాయంత్రం సమయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుక్కర్ల లో పేలుడు పదార్థాలను నింపి, సైకిళ్లకు అమర్చి బస్ స్టాప్ మరియు షాపింగ్ ప్రాంతాల వద్ద ఉంచారు. టైమర్ ఆధారంగా అమర్చిన ఐఈడీలు వరుసగా పేలడంతో భారీ ప్రాణనష్టం జరిగింది.
ఫోరెన్సిక్ సాక్ష్యాలు, సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ కాల్ డేటా రికార్డులు దర్యాప్తులో కీలకంగా మారాయి. దేశ వ్యాప్తంగా నిందితుల వేట మొదలుపెట్టిన NIA ఈ ఆపరేషన్ చాలా పకడ్బందీ గా కొనసాగించింది.

దర్యాప్తు వేగంగా దేశవ్యాప్తంగా సాగింది. పలు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గా ఏర్పడి అధికారులు త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేశారు.

ఇండో-నేపాల్ సరిహద్దులో యాసిన్ భత్కల్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేసి…. ఇతనే ప్రధాన మాస్టర్‌మైండ్‌గా గుర్తించారు. అతడితో పాటు అసదుల్లా అఖ్తర్ ను అదుపులోకి తీసుకున్నారు, ఢిల్లీ సమీపంలో తహ్సీన్ అఖ్తర్ ను, పశ్చిమ బెంగాల్‌లో జియాఉర్ రహ్మాన్ ను, మహారాష్ట్రలో అజాజ్ షేక్ ను పట్టుకుని వీరంతా ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులుగా, దర్యాప్తులో వీరంతా ఒకే నెట్‌వర్క్‌కు చెందినవారి గా, పేలుళ్లకు ముందు వీరి మధ్య జరిగిన ఫోన్ కమ్యూనికేషన్ జరిగినట్టుగా గుర్తించారు.

సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాలు, పేలుడు పదార్థాల విశ్లేషణ, కాల్ రికార్డులు, నిందితుల ప్రకటనలు కోర్టులో సమర్పించబడ్డాయి. విచారణ అనంతరం 2016లో ప్రత్యేక NIA కోర్టు ఐదుగురినీ దోషులుగా తేల్చి…… అమాయక జనం, నిరపరాధ ప్రజలపై జరిగిన ఈ దాడి సమాజంపై యుద్ధం తో సమానం అని, అందుకే “rarest of rare” కేటగిరీ కింద బావించి మరణదండన విధించింది.

దీని పై నిందితులు హైకోర్టులో అప్పీల్ చేశారు. అయితే హై కోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఉరిశిక్షను యథాతథంగా విధించింది. అంతేగాక దేశాన్ని భయపెట్టే ఉగ్రదాడులకు, కఠిన శిక్ష అవసరమని స్పష్టం చేసింది.

ఈ ఘటన తర్వాత హైదరాబాద్‌లో భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు జరిగాయి. ప్రతి చోట సీసీటీవీ పర్యవేక్షణ పెంచారు, పబ్లిక్ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ చెకింగ్, ఇంటెలిజెన్స్ సమన్వయం తో పాటు, నగర భద్రతా విధానాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

న్యాయ వ్యవస్థలో ఇటువంటి కేసుల్లో వేగవంతమైన తీర్పులు అత్యవసరం అని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. ఈ బ్లాస్ట్ లో ఆరోగ్యం దెబ్బతిన్న వ్యక్తులు కొందరైతే, మంచానికే పరిమితమైన వ్యక్తులు కొందరు. వారి వేదన వర్ణనాతీతం. ఈ ఉగ్రదాడులు నిందితులు సుప్రీంకోర్టు కు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి కి త్వరితమైన ముగింపు పలకాలని, పలువురు నెటిజన్లు కోరుతున్నారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading