Download App

శత్రువుల గుండెల్లో నిద్రపోయే “ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్”…

జూలై 3, 2026 By Suresh Thota
భరతమాత రక్షణే ధ్యేయం గా, దశాబ్దాల కాలంగా కాగితాలకే పరిమితమైన చారిత్రాత్మక సైనిక సంస్కరణ క్షేత్రస్థాయిలో సాకారమైంది. జూలై 1వ తేదీన భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకమైన "ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్" (IBGs) యుగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఆరుగురు మేజర్ జనరల్స్ నేతృత్వంలో ఐదు ఐబీజీలు, ఒక ప్రత్యేక...
శత్రువుల గుండెల్లో నిద్రపోయే "ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్"…

భరతమాత రక్షణే ధ్యేయం గా, దశాబ్దాల కాలంగా కాగితాలకే పరిమితమైన చారిత్రాత్మక సైనిక సంస్కరణ క్షేత్రస్థాయిలో సాకారమైంది. జూలై 1వ తేదీన భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకమైన “ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్” (IBGs) యుగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఆరుగురు మేజర్ జనరల్స్ నేతృత్వంలో ఐదు ఐబీజీలు, ఒక ప్రత్యేక ఫైర్-సపోర్ట్ గ్రూప్ సరిహద్దుల్లో బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ఈ రోజు…. దేశ రక్షణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఇది కేవలం సైనిక పునర్వ్యవస్థీకరణ కాదు, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే నవభారత రక్షణ రంగ ప్రకటన.

గతంలో మన సైన్యం “కోల్డ్ స్టార్ట్” వ్యూహాన్ని అనుసరించినప్పటికీ, సాంప్రదాయ బ్రిగేడ్, డివిజన్ వ్యవస్థల్లో కొన్ని సహజమైన లోపాలు ఉండేవి. యుద్ధం సంభవించినప్పుడు ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీ, ఆర్మర్డ్ ట్యాంకులు, ఎయిర్ డిఫెన్స్ విభాగాలు వేర్వేరు కమాండ్ల నుండి సరిహద్దుకు చేరుకోవడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం పట్టేది. ఆ కాలయాపన శత్రువుకు అప్రమత్తమయ్యే అవకాశాన్ని ఇచ్చేది. కానీ నేడు ఆ పాత పద్ధతులకు కాలం చెల్లింది. ఇకపై శత్రువు కన్నెత్తి చూస్తే, క్షణాల మీద విరుచుకుపడేలా అన్ని విభాగాలనూ ఒకే గొడుగు కిందకు తెస్తూ ఈ “ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్” రూపుదిద్దుకున్నాయి.

“​ఐబీజీ” అంటేనే సర్వసన్నద్ధత, శరవేగ కదలిక. ఒక్కో గ్రూపులో ఐదు నుండి ఎనిమిది వేల మంది సుశిక్షితులైన సైనికులు ఉంటారు. ఒకే కమాండర్ నేతృత్వంలో ట్యాంకులు, శరవేగంగా కదిలే వాహనాలు, సుదూర క్షిపణులు, రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు అన్నీ ముందే కలిసిపోయి ఉంటాయి. క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి ఇక ఏ ప్రధాన కార్యాలయం అనుమతి కోసమో వేచి చూడాల్సిన అవసరం లేదు. శత్రువు కదలికపై ఆదేశాలు వచ్చిన మరుక్షణమే, ఒకే ఒక్క కమాండ్ ద్వారా నిమిషాల వ్యవధిలో శత్రువు భూభాగంలోకి దూసుకువెళ్లి కోలుకోలేని దెబ్బ కొట్టే శక్తి భారతావనికి సమకూరింది.

ఈ సరికొత్త రక్షణ వ్యవస్థ ప్రపంచంలోని అగ్రరాజ్యాల సరసన భారతదేశాన్ని నిలిపింది. అమెరికాకు చెందిన “బ్రిగేడ్ కాంబాట్ టీమ్స్”, చైనాకు చెందిన “కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్స్” ఏ విధంగానైతే ఆయా దేశాలకు వ్యూహాత్మక బలమయ్యాయో, ఇప్పుడు మన “ఐబీజీ”లు కూడా హిమాలయ పర్వతాల నుండి థార్ ఎడారుల వరకు మన సార్వభౌమాధికారానికి రక్షణ వలయాలుగా మారాయి. చైనా, పాకిస్తాన్‌లతో ఏకకాలంలో ముప్పు పొంచి ఉన్న “టూ ఫ్రంట్ వార్” సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టేలా, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మన సైన్యాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం ఈ వ్యవస్థ ప్రత్యేకత.

నిజానికి ఇటువంటి ముందడుగు గతంలోనే పడాల్సి ఉన్నా, గత ప్రభుత్వాల కాలంలో ఉన్న సంకీర్ణ రాజకీయ పరిమితులు, బడ్జెట్ అడ్డంకులు మరియు బ్యూరోక్రసీ తాత్సారం వల్ల ఈ ఫైళ్లు ముందుకు కదల్లేదు. 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడు చేపట్టిన “ఆపరేషన్ పరాక్రమ్” సమయాన మన సైన్యం లోని అన్ని విభాగాలు సరిహద్దుకు చేరుకోవడానికి దాదాపు మూడు వారాల సమయం పట్టింది. ఆ చేదు అనుభవం నేర్పిన గుణపాఠం తో, ఆ తర్వాత వచ్చిన కార్గిల్ రివ్యూ కమిటీ సిఫార్సులు సైన్యంలో పెను మార్పులు అవసరమని స్పష్టం చేసినా, అప్పటి పాలకులు కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయారు.

2014 తర్వాత దేశ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. స్పష్టమైన మెజారిటీ, అచంచలమైన దేశభక్తి, బలమైన రాజకీయ సంకల్పం ఉన్న మోడీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని సమూలంగా మార్చడానికి నడుం బిగించింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న “చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్” (CDS) పదవిని సృష్టించడం ఈ వ్యూహాత్మక విజయానికి తొలి పునాది. మొదటి సిడిఎస్ గా జనరల్ “బిపిన్ రావత్” చూపిన చొరవ, తీసుకున్న నిర్ణయాలు తో పాటు, ప్రస్తుత సైనిక నాయకత్వం యొక్క నిరంతర కృషి ఫలితంగానే నేడు “ఐబీజీ”లు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చాయి.

ముఖ్యంగా 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనా విస్తరణవాద బుద్ధికి అడ్డుకట్ట వేయడం అత్యవసరంగా మారింది. ఆధునిక డిజిటలైజ్డ్ యుద్ధ తంత్రాలకు అనుగుణంగా మన సైన్యం మారాలని ఈ ప్రభుత్వం గట్టిగా సంకల్పించింది. కేవలం సైనిక నిర్మాణాన్ని మార్చడమే కాదు, “ఐబీజీ”లకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలు, నిఘా డ్రోన్లు, రక్షణ కవచాలను “మేక్ ఇన్ ఇండియా” ద్వారా స్వదేశీయుల మేధస్సు , భారతీయ స్వశక్తి తో తయారు చేసేలా “ఆత్మనిర్భర్ భారత్” ఊతమిచ్చింది. ఈ ఏడాది ఏకంగా రక్షణ రంగానికి రూ. 7.85 లక్షల కోట్లు కేటాయించడం రక్షణ రంగ ఉత్పత్తులు పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం.

చిన్న పరిమాణంలో ఉంటూ అత్యంత రహస్యంగా, శరవేగంగా కదలడం “ఐబీజీ”ల ప్రధాన బలం. శత్రు దేశాల ఉపగ్రహాలు మన సైన్య కదలికలను పసిగట్టే లోపే, ఉరుము లేని పిడుగులా శత్రువు మీద దాడి కి మన జవాన్లు దూసుకుపోగలరు. లీన్ అండ్ మీన్ ఫైటింగ్ ఫోర్స్‌గా మారిన మన ఆర్మీ, (less manpower, more firepower) “తక్కువ మంది మనుషులు.. ఎక్కువ విధ్వంసం” అనే సూత్రంతో పనిచేస్తూ మన సరిహద్దులను అజేయమైన కోటలుగా మారుస్తోంది. ఈ స్మార్ట్ మిలిటరీ మోడల్ మన సైనికుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూనే, శత్రువుపై వంద రెట్లు ఎక్కువ ప్రభావంతో ఎదురుదాడి చేస్తుంది.

జాతి ప్రయోజనాలే పరమావధిగా, దేశ రక్షణే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతున్న ప్రస్తుత భారతదేశం, సరిహద్దుల వద్ద శాంతిని కోరుకుంటుంది. కానీ ఆ శాంతి చేతకానితనం కాదు. దీనికి నిదర్శనం గా “ఆపరేషన్ సింధూర్” తో ప్రపంచం మొత్తం కి తేటతెల్లం అయ్యింది. ఇటు “డీఆర్‌డీఓ” అభివృద్ధి చేసిన “మల్టీ లేయర్డ్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్”, అటు కోల్‌కతాలో జలప్రవేశం చేసిన స్వదేశీ యుద్ధనౌకలు “దునగిరి”, “సంశోధక్”, “అగ్రయ్”… వీటన్నింటికీ మకుటాయమానంగా నిలిచిన “ఇంటిగ్రేటెడ్ బాటిల్ గ్రూప్స్” నేడు భారతమాత రక్షణ సేవ కోసం సిద్ధంగా ఉన్నాయి.

ముగింపు: హిమగిరుల సమున్నత శిఖరాల సాక్షిగా, అరేబియా, హిందూ, బంగాళాఖాతం సాగర గర్భ తరంగాల సాక్షిగా, నేడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. మాతృభూమి రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సైనికులకు, వారి వెనుక కొండంత అండగా నిలిచిన నాయకత్వానికి ఈ దేశం జేజేలు పలుకుతోంది. ఏ శత్రువు కూడా మన వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేనంత శక్తిమంతంగా మారిన భారతావనిని చూసి గర్విద్దాం. సైనికుల శౌర్యానికి, దేశ సార్వభౌమాధికారానికి ముక్తకంఠంతో… జై హింద్… భారత్ మాతా కీ జై… అని నిననిద్దాం

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading