
“చేసుకున్నవాడికి…. చేసుకున్నంత మహాదేవ అన్నారు పెద్దలు” ఎంత గొప్పవారు అయినా, ఒకరోజు అటు ఇటు కావచ్చేమో కాని చేసిన పని తప్పు అయితే మాత్రం అనుభవించాల్సిందే…
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కష్టపడి, రాత్రనక, పగలనక చదువుకుని, సివిల్స్ పరీక్షలు రాసి ఎన్నో కలలతో అది చేయాలి, ఇది చేయాలి అని యువ రక్తం తో ఉరకలెత్తే వయసు తో ఉత్సాహం గా జాయిన్ అవుతారు. కాని తదనంతర కాలంలో ధన, కుల, మత, ప్రాంతీయ , బంధు ప్రీతి ఇలా ఎక్కడో లొంగిపోయి తమ భవిష్యత్తు ను వాళ్లే తుంగలోకి తొక్కేసుకుంటున్నారు.
రాజకీయ నాయకులు వస్తుంటారు. పోతూ ఉంటారు. వీళ్ళకి మాత్రం చక్కటి హోదాతో కూడిన పరిపాలనాధికారలు ఉంటాయి. నీతిగా, నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తే చరిత్రలో నిలిచిపోతారు. ఉదా: అశోక్ ఖేమ్కా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో, రాజు నారాయణ స్వామి 32 ఏళ్లలో 30 సార్లు బదిలీ అయినా నిజాయితీ వీడని కేరళ అధికారి, అలాగే వినోద్ రాయ్, తుకారాం ముండే, ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటిస్తూ రాజకీయ నాయకులకు నిద్ర లేకుండా చేసిన టి ఎన్ శేషన్ లాంటి వారు ఎందరో.
ఐపిఎస్ ల విషయానికి వస్తే.. .డి. రూప. జైళ్లలో రాజకీయ నాయకులకు అందుతున్న VIP చికిత్సను బయటపెట్టిన అధికారిణి, తీహార్ జైలు లో సంస్కరణలు తీసుకువచ్చిన కిరణ్ బేడీ, మరియు సంజుక్త పరాశర్ అస్సాంలో మిలిటెంట్లకు వ్యతిరేకంగా నిర్భయంగా పనిచేసిన అధికారి, ఇలా ఎందరో ఉన్నారు. వీళ్ళని ఎందుకు గుర్తు చేసుకుంటారు…. వాళ్ళ నిజాయితీ ని బట్టి, కాని ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మీ , కొన్ని ఒత్తిడులకు లొంగిపోయిన సీతారామాంజనేయులు, సునీల్ కుమార్, విశాల్ గున్ని ఇలా తమ బాధ్యతలు మరచి, వ్యక్తి పూజకు అలవాటు పడిపోయి తమ పేర్లకు కళంకం తెచ్చుకుంటున్నారు.

అటువంటి కోవకు చెందిన వ్యక్తే మరో ఐపిఎస్ అధికారి సునీల్ నాయక్ 2005 సంవత్సరం బీహార్ కు చెందిన బ్యాచ్… ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక భూమిక పోషించారని… ఈ సునీల్ నాయక్ ను బీహార్ లోని పాట్నా నుండి AP పోలీసులు అదుపులోకి తీసుకుని ఆంధ్రా ప్రదేశ్ కు తీసుకు వస్తున్నారు. వైసీపీ హయాంలో డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ లో పనిచేసిన సునీల్ నాయక్… కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీహార్ కు వెళ్ళిపోయారు.
అప్పటి MP, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కేసులో తన అధికారాలను అడ్డుపెట్టుకుని, నిబంధనలు కు వ్యతిరేకంగా వ్యవహరించినట్టుగా భావించి, కోర్ట్ విచారణకు హాజరవ్వమని నోటీసులు ఇవ్వగా ఈయన స్పందించనట్లుగా తెలుస్తుంది. అందుకు కోర్టు ఆయన్ని తీసుకురమ్మని ఆదేశాలు జారీ చేసింది. అందుకు బీహార్ పోలీసు అధికారులతో సంప్రదించి ఈ సునీల్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారని… ఈయన ద్వారా మిగతా వారి పేర్లు బయటకు వస్తాయని… అప్పుడు రాష్ట్రంలో సంచలనమైన అరెస్టులు జరుగుతాయి అని ఒక పోలీసు ఉన్నతాధికారి నర్మ గర్భంగా వ్యాఖ్యానించారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటినుండి, కలెక్టర్లను, SPలను చూపిస్తూ ఇలా అవ్వాలంటే గొప్పగా చదువుకుని సివిల్స్ పాసయ్యి… ఇలా గొప్పగా సమాజానికి సేవ చేయాలని, నిజమైన హీరోలు వీళ్ళే అని చెబుతుంటారు. ఇప్పుడు ఇటువంటి అధికారులను చూపిస్తే వాళ్ళ ఆలోచన… ఏదో విధంగా రాజకీయ నాయకుడి అవతారం ఎత్తితే చాలు… వీళ్ళందరూ మనవెంటే ఉంటారు అని సందేశం అంతర్లీనంగా ఇచ్చినట్లుగా ఉంటుందియేమో…. అని ఒక నెటిజన్ వాపోవడం… నిజంగా లోతుగా ఆలోచించవలసిన విషయమే.
ఐఏఎస్ లు… ఇలా “అయ్యా ఎస్” గా మారిపోతే భావితరాలకు, సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నట్లు, పోనీ వారి కుటుంబ సభ్యులకైనా ఏమని చెబుతారు అని సోషల్ మీడియాలో ఈ వార్త ను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
