
SLBC టన్నెల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఎడమ వైపు సొరంగం పనుల్లో 14వ కిలోమీటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. 3 మీటర్ల మేర పైకప్పు ఊడిపడినట్టు సొరంగంలో పనిచేస్తున్న కార్మికులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో సొరంగంలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మట్టిపెల్లలు విరిగి పడిన వెంటనే అక్కడ్నుంచి 42 మంది దూరంగా జరిగారు. ఆ తర్వాత బయటకొచ్చారు. 8 మంది కార్మికులు మాత్రం లోపల చిక్కుకున్నారు.
బయటపడిన 42 మందిలో ముగ్గురికి గాయాలు కాగా, వెంటనే వాళ్లను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చిక్కుకుపోయిన కార్మికుల్ని బయటకు తీసేందుకు సహాయ చర్యల్ని ముమ్మరం చేశారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రత్యేక హెలికాప్టర్ లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, ఇతర ఉన్నతాధికారులున్నారు. టన్నెల్ లో చిక్కుకున్నవాళ్లలో ముగ్గురు జార్ఖండ్ పౌరులు కాగా.. ముగ్గురు ఉత్తరప్రదేశ్ కు, ఒకరు పంజాబ్, మరొకరు జమ్ముకశ్మీర్ కు చెందిన కార్మికులు.
