
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, విద్యా రంగం అభివృద్ధి వంటి అనేక అంశాలపై చర్చ జరిగింది.
రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన లోకేష్, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు మరింత సహకారం అందించాలని కోరారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు అనేక సంస్కరణలు చేపట్టినట్టు తెలియజేసి, ఉన్నత విద్యా రంగంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రధాని మార్గదర్శకం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత 15 నెలలుగా ప్రధాని సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని లోకేష్ వివరించారు. “వికసిత్ భారత్–2047 లో భాగస్వాములం అవుతామని” ఆయన తెలిపారు.

జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించినందుకు ప్రధానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలను ప్రధానికి వివరించారు.
ప్రధాని మోదీ స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను మంత్రి లోకేష్ ప్రధానికి అందజేశారు.
