
2035 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, ఆనందభరితమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువతకు కేవలం ఉద్యోగాలు కల్పించడం మాత్రమే కాకుండా, ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం కూడా అవసరమని పేర్కొన్నారు. పిల్లల్లో క్రమశిక్షణ, విలువలు పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, యువత తమ లక్ష్యాల సాధనపై నమ్మకంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన ‘యంగ్ ఆంధ్ర.. థ్రైవింగ్ ఆంధ్ర’ ముఖాముఖి కార్యక్రమంలో ఉపాసన కొణిదెల అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానమిచ్చారు. మహిళల ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక స్వావలంబనతో పాటు యువతకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవకాశాలు, విద్యా వ్యవస్థలో మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వంటి అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
యువతకు ప్రపంచ అవకాశాలపై అవగాహన కల్పించాలి
ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు సరైన అవగాహన లేకపోవడమేనని నారా లోకేష్ అన్నారు. చాలా మంది యువకులు అమెరికా వెళ్లాలని ఆశపడుతున్నారని, అయితే విద్య, వైద్య రంగాల్లో ఇతర దేశాలు కూడా ఇప్పుడు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు. ఒకవైపు మన విద్యా వ్యవస్థను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడంతో పాటు, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలపై యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మహిళలకు ఉద్యోగాలు, ఆర్థిక స్వావలంబన
మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యోగ రంగంలోకి వచ్చేలా ప్రత్యేక విధానాలను రూపొందించాలని లోకేష్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా మహిళలను మరింత చురుగ్గా ఉద్యోగాల్లోకి ఆహ్వానించాలని సూచించారు.
చిన్న వయసు నుంచే పిల్లల్లో లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుకు పాఠశాల స్థాయిలోనే మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఒకటి, రెండో తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనులను మహిళలు, పురుషులు సమానంగా పంచుకుంటున్నట్లు చూపించే చిత్రాలను 50-50 నిష్పత్తిలో చేర్చినట్లు వెల్లడించారు. సమాజంలో ఇలాంటి మార్పులు తీసుకురావడానికి రాజకీయ నాయకులు, విద్యాశాఖ మంత్రులు ప్రత్యేకంగా కృషి చేయాలని పేర్కొన్నారు.
AIకి మన ఆలోచనా శక్తిని అప్పగించకూడదు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత అభివృద్ధి చెందినా మనిషి సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పూర్తిగా భర్తీ చేయలేదని నారా లోకేష్ అన్నారు. ముఖ్యంగా క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ (విమర్శనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచన) అత్యంత కీలకమైన నైపుణ్యమని పేర్కొన్నారు.
AI మన ఉత్పాదకతను పెంచే శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని, అయితే మన ఆలోచనా శక్తిని, నిర్ణయాధికారాన్ని పూర్తిగా దానికి అప్పగించకూడదని యువతకు సూచించారు. AIని తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకునే సాధనంగా ఉపయోగించుకోవాలని, సొంత ఆలోచనలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
యువతకు మెరుగైన అవకాశాలు, మహిళలకు సమాన ఉపాధి అవకాశాలు, ఆధునిక విద్యా వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవడం వంటి అంశాల సమ్మేళనంతో 2035 నాటికి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలన్నది తమ లక్ష్యమని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
