
విశాఖపట్నాన్ని సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిల్మ్ మేకర్స్‌తో పాటు ఇతర క్రియేటర్లకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ విశాఖలో ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తోందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
సీఐఐ 31వ పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో నటుడు రానా దగ్గుబాటితో కలిసి పాల్గొన్న నారా లోకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్ఫూర్తితో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించి, నిర్దిష్ట గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం భవిష్యత్తుపై తనకున్న నమ్మకాన్ని నారా లోకేష్ ఆసక్తికరంగా వివరించారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నటుడు రానా దగ్గుబాటి ‘బాహుబలి’ సినిమాను ఎంతగా నమ్మారో, తాను కూడా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికే ఒక ఆర్థిక శక్తిగా మారుతుందని అంతే బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ విధానాల రూపకల్పన కూడా సినిమా నిర్మాణం లాంటిదేనని లోకేష్ అభిప్రాయపడ్డారు. స్పష్టమైన విజన్, పక్కా ప్రణాళిక, సమర్థవంతమైన అమలు ఉంటే ఆశించిన ఫలితాలను సాధించవచ్చని ఆయన వ్యాఖ్యల ద్వారా వెల్లడించారు.
విశాఖలో ఎంటర్టైన్మెంట్ రంగానికి ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే సినిమా నిర్మాణం, సృజనాత్మక రంగాలు, ఇతర అనుబంధ పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రణాళికపై సినీ పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
