ఆంధ్ర ప్రదేశ్

పొద్దుటూరు సభలో చంద్రబాబు సవాల్.. జగన్‌కు ఘాటు ప్రశ్నలు

Published by
Rahul N

పొద్దుటూరు సభ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తమ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయబోతోందని ప్రకటించారు.

“పొద్దుటూరు సభ సాక్షిగా హామీ ఇస్తున్నా.. రెండేళ్లలో రూ.30,136 కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించే బాధ్యత మా ప్రభుత్వానిది” అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

ఇదే సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చంద్రబాబు ప్రస్తావించారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిపోయిందని, రూ.40 కోట్ల సుపారీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆయన ఆరోపించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపిస్తున్న మద్యం కుంభకోణాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపిస్తూ.. అంతిమ లబ్ధిదారుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైపు ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

“ధైర్యముంటే వీటిపై ప్రజలకు సమాధానం చెప్పు జగన్” అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. కడప నుంచే జగన్‌కు సవాల్ విసురుతున్నానని, ధైర్యముంటే ముందుకొచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.

జల్ జీవన్ మిషన్ అమలుపైనా చంద్రబాబు విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు రూ.1 లక్ష కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.83 వేల కోట్లు, కేరళకు రూ.85 వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు అందగా.. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే తీసుకువచ్చారని ఆరోపించారు. జల్ జీవన్ మిషన్‌ను నిర్వీర్యం చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు.

రాష్ట్రంలో తాగునీటి మౌలిక వసతులను మరింత బలోపేతం చేసి, రాబోయే రెండేళ్లలో 90 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Rahul N

Recent Posts