
రాష్ట్రంలో ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నిరుద్యోగులు, ఈసారి డీఎస్సీలో క్వాలిఫై కాని అభ్యర్థులు నిరంతరం ప్రిపేర్ అవుతూ ఉండాలని సూచించారు. భవిష్యత్తులో డీఎస్సీ నిర్వహణకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని, ఇది ప్రతి ఏడాది జరిగే ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి నారా లోకేష్‌కు స్పష్టం చేశారు.
రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగిన మెగా డీఎస్సీ విజేతల సభలో ముఖ్యమంత్రి పాల్గొని కొత్తగా ఎంపికైన 15,941 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “సీఎంగా బాధ్యతలు చేపట్టాక చేసిన తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే. అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా డీఎస్సీని నిర్వహించాం. కేవలం 150 రోజుల్లో ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన మంత్రి నారా లోకేష్ బృందానికి అభినందనలు” అని అన్నారు.
చంద్రబాబు గారు విద్యకు ప్రాధాన్యతనిస్తూ, “పేదరికం లేని సమాజం కోసం విద్యే ఆయుధం. టీచర్లు పిల్లలకు నైతిక విలువలు బోధించి, భవిష్యత్తులో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మగవాళ్ల కంటే మహిళలు విద్యాబోధనలో మెరుగ్గా రాణిస్తారు. అందుకే సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం” అని పేర్కొన్నారు.
తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే విద్యా రంగానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నానని, రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో టీచర్ల నియామకాలు తానే చేసినట్టు గుర్తుచేశారు. “విద్యా రంగాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రాథమిక విద్య బలంగా ఉంటే ఉన్నత విద్యలో అద్భుత ఫలితాలు వస్తాయి. టీచర్లు సమూల మార్పులు తీసుకురావాలి” అని సూచించారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. “2019-24 మధ్యకాలం విద్యా వ్యవస్థకు శాపంగా మారింది. 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిపోయారు. ఇంగ్లిష్ మీడియం పేరుతో ప్రాథమిక విద్యా వ్యవస్థను దెబ్బతీశారు, తెలుగు మీడియంను నిర్లక్ష్యం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు ఆడుకున్నారు” అని ఆరోపించారు.
విజేతల సభలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులతో సీఎం ముఖాముఖి కూడా నిర్వహించారు. తనను రాజకీయాల్లో ప్రోత్సహించిన ప్రొఫెసర్ డీఎల్ నారాయణను గుర్తు చేసుకుంటూ, పిల్లలను ప్రోత్సహిస్తే వారు అద్భుత ఫలితాలు సాధిస్తారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించి, వారిని సమాజానికి మంచి పేరు తెచ్చేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు.
