
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం క్రమంగా విస్తృత ప్రయోజనాలను అందిస్తోంది. ముఖ్యంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా రోజూ సగటున 26.95 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని రవాణా సంస్థ అధికారులు తెలిపారు.
ఈ పథకం ఇటీవల ఆగష్టు 15న ప్రారంభం కాగా, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బస్సుల్లో ప్రయాణించి, మహిళల స్పందనను పరిశీలించారు. ఈ కార్యక్రమం ద్వారా పథకంపై ప్రజల ఫీడ్‌బ్యాక్ తేసూకొన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న 11,449 ఆర్టీసీ బస్సుల్లో 8,458 బస్సులు ఈ పథకం కోసం వినియోగంలో ఉన్నాయని స్పష్టంచేశారు. అంటే సుమారు 80% మంది ప్రయాణించే ప్రధాన సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉందని వివరించారు.
ఇక ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులు, ఏసీ బస్సులు, నాన్-స్టాప్ సర్వీసులు మాత్రం ఈ పథకం నుంచి మినహాయింపులో ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ విషయాన్ని కొందరు వక్రీకరించి “కేవలం కొన్ని బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అమలవుతోంది” అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని గుర్తించారు.
ప్రజలు ఫేక్ ప్రచారాలను నమ్మకుండా, అధికారిక వివరాలనే ఆధారంగా తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న స్త్రీ శక్తి పథకం ద్వారా లక్షలాది మహిళలు ప్రతిరోజూ ప్రయోజనం పొందుతున్నారని అధికారులు స్పష్టంచేశారు.
