
“నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు… శ్రీశ్రీ కవితలో ఈ పంక్తి మేరకు మాత్రమే నారా లోకేష్ను చూస్తూ వైరి పక్షాలు నిబిడాశ్చర్యంతో విస్తుబోతున్నాయి.
ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే… ఈ రోజు నారా లోకేష్ జన్మదినం. రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తండ్రిలా నిరంతరం ఆలోచిస్తూ… తన రాజకీయ శత్రువుల అంచనాలకు అందకుండా… ఈ రాజకీయ చదరంగంలో ముందుకు సాగిపోతున్నాడు.
కాని ఇక్కడ నారా లోకేష్ రాజకీయ జీవితం లో రాజకీయ ప్రవేశం చేసిన వెంటనే వైరి పక్షాలు విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డాయి… నానా మాటలు అన్నాయి… పప్పు అని సంభోధించాయి… బాడీ షేమింగ్ కి పాల్పడ్డాయి… అంటే ముందుగానే అతని శక్తి సామర్ధ్యాలను వైరి పక్షాలు బాగా అంచనా వేశాయి అనుకోవాలా… లేక రాజకీయంగా ముందుగానే అణగతొక్కితే ఇక టీడీపీకి చంద్రబాబు అనంతరం నాయకత్వం లోపించి కుక్కలు చింపిన విస్తరి అవుతుంది అని ఊహించి అలా చేసాయా… అన్నది చెప్పలేము… కాని ఒక్కటి మాత్రం నిజం వారి అంచనా తలక్రిందులైంది.
నారా లోకేష్ రాజకీయ జీవితం అందరూ అనుకున్నంత పూలబాట కాదు… “కాయలు కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు” అని ఒక నానుడి ఉంది. నారా లోకేష్ పైన ఆయనకు తెలియకుండానే అత్యంత బరువైన బాధ్యతను మోస్తున్నాడు. తన నటనా కౌశలంతో తెలుగు జాతి గర్వించే కారణ జన్ముడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనుమడు… తెలుగు ప్రజలను, యువతని, తన యొక్క వినూత్న ఆలోచనలతో, కొత్తగా వచ్చే సాంకేతికతను అందిపుచ్చుకుని రాష్ట్ర ప్రగతిని పరుగు పెట్టించి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు కొడుకు కావడం మూలంగా గురుతరమైన బాధ్యత ఆయనకు తెలియకుండానే ఆయన తన భుజస్కంధాలపై మోస్తున్నాడు.

ఆయన 2017 మార్చి 30లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి గా కొనసాగి… 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గము నుండి పోటీ చేసి ఓటమి పాలవడం… ఆ ఓటమి ఆయనలో కసిని, పట్టుదలను రేకెత్తించింది. “కరోనా” కాలాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు…. తెలుగు భాషని, వాగ్ధాటినీ మెరుగు పరుచుకుని ద్విగుణీకృతమైన ఉత్సాహం తో 2024 ఎన్నికల్లో పోటీచేసి తను విజయం సాధించి, పార్టీనీ మరొక స్థాయిలోకి తీసుకువెళ్లారు. చాలా తక్కువమంది ఇలా ఉంటారు. ఓటమితో నిరాశ , నిస్పృహలతో చాలా మంది కృశించిపోతారు. ఈయన అలాకాదు. ఇది ఆయన నుండి నేటి యువత ప్రేరణగా తీసుకోవలసిన అంశం.
ఇప్పుడు “ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి” మంత్రిగా కొనసాగుతున్నారు. రాజకీయ శత్రువుల సైతం ఆశ్చర్యపోయేలా, ఆయనను ఆయన మలుచుకున్న తీరు ని చూసి రాజకీయ పండితులు కూడా నోరెళ్ళబట్టే స్థాయిలో, ఆయన వ్యూహాలు ఉంటున్నాయని ఆయన్ని దగ్గరగా చూసిన కొందరి వ్యాఖ్యలు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన సంకల్ప బలంతో “నిప్పులు చిమ్ముకుంటూ నింగికి” ఎగురుతున్న ఆయనకు… మరొక సారి ఇండియా గ్లిట్జ్ తరపున జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ…
