ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (Mega PTM) విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలుకుతోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 43 వేల ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ఈ కార్యక్రమం దేశంలోనే అరుదైనదని పేర్కొన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రుల్లో ఉన్న సందేహాలు, ఆందోళనలను తొలగించి, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు కలిగిన అత్యంత సంతోషకరమైన సందర్భాల్లో ఒకటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించడమేనని లోకేష్ తెలిపారు. గతంలో కార్పొరేట్ విద్యాసంస్థలకే పరిమితమైన టాపర్ల ప్రకటనలు.. ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫొటోలతో ఇవ్వడం గర్వకారణమన్నారు. ఈ విజయంలో ప్రభుత్వం మాత్రమే కాదు.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉందని కొనియాడారు.
పాదయాత్ర సమయంలో పలువురు తల్లులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని లోకేష్ గుర్తు చేశారు. కుటుంబంలో ఒకరికే ఆర్థిక సాయం అందితే.. అబ్బాయిలను మాత్రమే చదివించి, అమ్మాయిలను ఇంట్లోనే ఉంచే పరిస్థితులు ఉన్నాయని వారు చెప్పారని వివరించారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివరించగా, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీంతో అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా ప్రతి విద్యార్థికి చదువు కొనసాగే అవకాశం లభించిందన్నారు.
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ గుడిసెలు, షెడ్లు, చెట్ల కింద కొన్ని పాఠశాలలు కొనసాగుతున్నాయని లోకేష్ తెలిపారు. ఈ పరిస్థితిని మార్చేందుకు వచ్చే ఏడాదిలో అన్ని గిరిజన పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
మెగా పీటీఎం కార్యక్రమాలకు హాజరయ్యే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం చేస్తారని లోకేష్ తెలిపారు. పిల్లలకు అందుతున్న భోజనం నాణ్యత, పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించి మరింత మెరుగుపరిచే ఉద్దేశంతోనే సీఎం అలా చేస్తున్నారని చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. అన్ని పనులు ఒకేసారి సాధ్యం కాకపోయినా.. దశలవారీగా ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు.
చివరగా, “ప్రేమ, సేవ, త్యాగం ఉన్నచోటే దేవుడు ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇద్దరు దేవుళ్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. వారిని గౌరవించడం కూడా ‘తల్లికి వందనం’లో భాగమే” అని లోకేష్ పేర్కొన్నారు.