బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థుల ఆందోళనలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ, “తరం మారుతుంది.. స్వరం మారుతుంది మోదీ.. జాగ్రత్తగా ఉండండి” అంటూ హెచ్చరించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, నేపాల్‌లో యువత ఉద్యమిస్తే ప్రభుత్వమే కూలిపోయిందని, యువత శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని అన్నారు. ప్రస్తుతం దేశంలో విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని, వారిని అణచివేయాలని ప్రయత్నించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన దీక్షకు ప్రధాన మీడియా ప్రాధాన్యం ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. ఈడీ, సీబీఐల భయంతో మీడియా మౌనం పాటించినా.. సోషల్ మీడియా ద్వారా యువత తమ గొంతును వినిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ అనవసరంగా Gen Z తరంతో తలపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. “జెన్‌జీ అంటే స్టోరీలు పెట్టుకునే వాళ్లు కాదు.. మేము విద్యార్థులం. మా హక్కుల కోసం పోరాడే తరం” అని అన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను తక్షణమే ఆపాలని, ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖండించారు.
ఈ ఉద్యమం ఏ రాజకీయ పార్టీ కోసం కాదని, విద్యార్థుల హక్కులు, భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణచివేయకుండా, వారి సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.