సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొన్న చంద్రబాబు.. రాష్ట్రాల మధ్య అసలైన పోటీ ఇప్పుడే మొదలైందన్నారు.
1990లో ఇంటర్‌నెట్ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అందుకున్న వాళ్లలో తానూ ఒకడినని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌కు జనాభా అనుకూలత ఉందన్న చంద్రబాబు డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను భారత్ సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు.
“ప్రస్తుతం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలే. నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా, చాలా మంది నాయకులను చూశాను. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాను.” అని సీఎం చంద్రబాబు తెలిపారు.
సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉందని… 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి కష్టపడుతున్నానన్నారు.