
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్దెట్ ను ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బడ్జెట్ లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు ఈ బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారు.
అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు జరిగాయి. ఇక తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు అందించేలా బడ్జెట్ లో నిధులు కేటాయించారు.
ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు కూడా తల్లికి వందనం నిధులు అందించబోతున్నారు. అలా ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తల్లికి వందనం స్కీం అందిస్తారు. ఈడబ్బులన్నీ విద్యార్థుల తల్లల ఖాతాల్లోకి వెళ్తాయి.
ఎటువంటి జాప్యం లేకుండా.. కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్టులో ప్రస్తావన తెచ్చారు. ఈ ఏడాదిలోనే రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్టులో ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, చేనేతలకూ నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నారు.
