
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్ను విధానాన్ని, కూటమి సర్కారు పూర్తిస్థాయిలో నిలిపివేసింది. ఈ మేరకు చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు పురపాలక శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 31 నుంచి ఈ రద్దు అమల్లోకి వస్తుంది.
వైఎస్ జగన్ హయాంలో చెత్త పన్ను వేశారు. ప్రతి ఇంటి నుంచి పన్ను సేకరించారు. అలా 187 కోట్ల రూపాయలు వసూలు చేశారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ జగన్ వెనక్కు తగ్గలేదు. ఇప్పుడా పన్ను ను కూటమి సర్కారు రద్దు చేసింది.
నిజానికి ఎన్నికల ప్రచారంలో ఇది కూడా ఓ హామీగా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దు చేస్తామంటూ కూటమి నేతలు ప్రజలకు హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఇప్పుడా పన్నును రద్దు చేశారు.
కూటమి సర్కారు తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దాన్ని గవర్నర్ ఆమోదానికి పంపించారు. అనుమతి లభించడంతో గెజిట్ విడుదల చేశారు. తాజాగా దీనిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇకపై ప్రజలెవ్వరూ చెత్త పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.
