
అమరావతి ప్రాంతంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూములపై ప్రభుత్వం పునఃసమీక్ష చేసింది. కొన్ని సంస్థలకు కేటాయింపులు తగ్గించగా, మరికొన్ని సంస్థలకు ఏకంగా కేటాయింపులు రద్దు చేసింది. గడువులోగా అన్ని సంస్థలు నిర్మాణాలు పూర్తిచేయాలని స్పష్టం చేసింది.
అమరావతి పరిథిలో 131 సంస్థలకు భూములు కేటాయించింది ప్రభుత్వం. వీటిలో 31 సంస్థల ప్రతిపాదనల్ని యథాతథంగా ఆమోదించింది. 2 సంస్థలకు ఇచ్చిన భూముల ప్రాంతాన్ని మార్చింది. 13 సంస్థలకు ఇచ్చిన కేటాయింపుల్ని రద్దు చేయగా, మరో 16 సంస్థలకు ఇచ్చిన భూమిని ప్రాంతం మార్చడంతో పాటు విస్తీర్ణాలు కూడా మార్చింది. కొత్తగా ఏ సంస్థకు కేటాయింపులు చేయడం లేదు.
సంస్థలకు కేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేకంగా సమావేశమైంది. మంత్రులు నారాయణ, దుర్గేష్, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్ సమావేశంలో పాల్గొన్నారు. సంస్థలకు కేటాయించిన భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేశారు.
భూములు తీసుకొని సైలెంట్ గా ఉంటే కుదరదని, దాన్ని గడువులోగా అభివృద్ధి చేయాలని మంత్రి వర్గ ఉపసంఘం తేల్చి చెప్పింది. రేట్లు పెరిగిన తర్వాత అభివృద్ధి చేద్దామంటూ కూర్చుంటే కుదరదని స్పష్టం చేసింది.
