
పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శల కారణంగా అరెస్ట్ అయిన వైసీపీ మాజీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి.. తను చేసిన వ్యాఖ్యలకు, సజ్జలకు సంబంధం ఉందనే విషయాన్ని బయటపెట్టారు. సజ్జల స్క్రిప్ట్ కు తగ్గట్టే తను నడుచుకున్నానని ఆయన చెప్పినట్టు కథనాలు వస్తున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించాడు. స్క్రిప్ట్ ఎవరిదైనా అనుభవించేది మాత్రం పోసాని అని అన్నారామె. అనంతపురంలో జరిగిన ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరైన అనిత.. ఈ వ్యాఖ్యలు చేశారు.
పోసాని గతంలో అత్యంత దారుణంగా మాట్లాడారని, ఆయన చేసిన తప్పుకు చట్టరీత్యా శిక్ష తప్పదన్నారు. పోసాని మాటల్ని సమర్థించేవారు రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరన్నారు. ఈ సందర్భంగా మరో నేత గోరంట్ల మాధవ్ ను కూడా హెచ్చరించారు.
పదేపదే అంతర్యుద్ధం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్, తన పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా మాధవ్ తన నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పుడున్నది వైసీపీ ప్రభుత్వం కాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
