తమిళనాడులోని కరూర్ జిల్లాలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన భారీ సభలో విషాదం చోటు చేసుకుంది. సభలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడినవారు ప్రస్తుతం కరూర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
పోలీసుల సమాచారం మేరకు, సభ వేదిక వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చారు. విజయ్ ప్రసంగం కోసం సుమారు 30,000 మందికి పైగా జనసంద్రం వేచి ఉన్నట్లు అంచనా. అయితే విజయ్ రాక ఆరు గంటలకుపైగా ఆలస్యమవ్వడంతో, అప్పటికే హాల్ చుట్టూ ఉన్న గుంపులు నియంత్రణలో లేకుండా పెరిగిపోయాయి. ఆ సమయంలో ముందువరుసలో కొంతమంది అభిమానులు మూర్ఛపోవడంతో ఆందోళన చెలరేగి, ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్లు తెలిసింది.
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో స్పందిస్తూ – “కరూర్ ఘటన చాలా బాధాకరం. వెంటనే గాయపడిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించాలని ఆదేశించాను. ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ సహాయక చర్యలు చేపడుతున్నారు. అదనపు డీజీపీకి శాంతి భద్రతలు పునరుద్ధరించమని ఆదేశించాం. మంత్రి అన్బిల్ మహేష్ యుద్ధ ప్రాతిపదికన సహాయం అందిస్తారు. ప్రజలు పోలీసులతో సహకరించాలి,” అని తెలిపారు. రేపు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు కూడా స్టాలిన్ ప్రకటించారు.
గతంలోనూ విజయ్ సభలపై భద్రతా అంశాలపై తీవ్ర చర్చ నడిచింది. ఈ నెల 13న త్రిచిలో జరిగిన మొదటి సభలోనూ అభిమానుల గుంపులు అదుపు తప్పి ట్రాఫిక్ జామ్ సృష్టించాయి. దాంతో పోలీసు విభాగం విజయ్ సభలపై 23 షరతులు విధించింది. కాన్వాయ్‌లలో చేరకూడదు, గర్భిణీలు, వృద్ధులు, దివ్యాంగులు సభలకు రావద్దంటూ సూచనలు ఇచ్చినా, వాటిని బహిరంగంగానే ఉల్లంఘించినట్లు విమర్శలు ఉన్నాయి.
కరూర్ విషాదం నేపథ్యంలో టీవీకే బాధ్యత, పోలీసుల సన్నద్ధతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందే హెచ్చరికలు ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.