తమిళనాడులోని కరూర్ జిల్లా చరిత్రలో ఎన్నడూ మరచిపోలేని విషాదం చోటుచేసుకుంది. టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ సభకు పోలీసులు 10 వేల మందికే అనుమతి ఇచ్చారు. కానీ అభిమానుల ఉత్సాహం ఊహలకు అందనంత పెరిగింది. ఒక చూపు కోసం, ఒక నినాదం కోసం, ఒక జెండా ఊపడానికి 30 వేలకు పైగా జనసందోహం వేదిక చుట్టూ చేరారు. ఆ అభిమానుల ఆరాధనే చివరికి కన్నీటి సుడిగుండంగా మారింది.
విజయ్ రాక ఆరు గంటలు ఆలస్యమవ్వడంతో అప్పటినుండి నిరీక్షిస్తున్న వారిలో నియంత్రణ తప్పింది. ముందువరుసలో కొంతమంది అభిమానులు మూర్ఛపోవడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. క్షణాల్లోనే అదుపు తప్పి గుంపులో తొక్కిసలాట జరిగింది. ఆ అరుపులు, ఆ కేకలు, ఆ ఆర్తనాదాలు వేదిక చుట్టూ నిలిచినవారి గుండెల్ని పిండేశాయి.
ఘటనలో 30 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరూర్ ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. తమ పిల్లలను, సోదరులను, తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాలు విలపిస్తున్నాయి.
ఈ సభలో చోటుచేసుకున్న విషాదానికి ప్రధాన కారణం అభిమానుల ఆరాధనేనని చాలా మంది అంటున్నారు. పోలీసులు విధించిన పరిమితులు కంటే మూడింతల మంది రావడం, భద్రతా సిబ్బంది వారిని నిలువరించడానికి సరిపోకపోవడం ప్రాణనష్టానికి కారణమయ్యాయని తెలుస్తోంది.
విజయ్ ఒక్కసారి వేదికపైకి రావాలని, ఆయన స్వరాన్ని వినాలని, ఆయన్ని ఒక్కసారి చూడాలని అభిమానంతో తరలివచ్చిన అభిమానుల ప్రాణాలు ఆరిపోయాయి. ఆ ఉత్సాహం కన్నీటి సముద్రంలో మునిగిపోయింది.