
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ లో జరిగిన దుర్ఘటనలో 8 మంది మరణించిన విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రమాదానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్, బాధ్యత వహించాలన్నారు.
“ఆనాడు మేం ఎస్ఎల్బీసీ మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే, మిగిలిన పనులు పూర్తి చేయకుండా 10 ఏళ్లు ప్రాజెక్టును పడుకోబెట్టారు కేసీఆర్. అలా పనులు ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మట్టిపెళ్లలు విరిగిపడి 8 మంది ప్రాణాలు పోయాయి. ఈ పాపం చంద్రశేఖర్ రావుదే. ఆయన పాపాల భైరవుడు”

కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో 2 లక్షల కోట్ల రూపాయల్ని వివిధ ప్రాజెక్టులకు కేటాయించారని, కానీ ఎస్ఎల్బీసీకి మాత్రం నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కృష్ణా జలాలు రాయలసీమకు తరలిపోవడానికి కేసీఆర్ కారణమన్నారు రేవంత్. రోజా ఇంటికెళ్లి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమను చేస్తానని కేసీఆర్ అన్నారని రేవంత్ విమర్శించారు. ఆనాడు కేసీఆర్ పెట్టిన సంతకమే ఇప్పుడు పాలమూరు పాలిట శాపమైందని ఆరోపించారు.
