
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణెదల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కూటమి నుంచి నారా లోకేష్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంతకాలు చేశారు.
నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. నామినేషన్ దాఖలుతో ఓ ప్రక్రియ పూర్తయింది. ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. ఎమ్మెల్యేలంతా ఇందులో తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ మేరకు పార్టీలన్నీ విప్ జారీ చేయబోతున్నాయి.
తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. 10వ తేదీ వరకు నామినేషన్లు వేయడానికి గడువు ఉంది. 11వ తేదీ లోపు ఉపసంహరించుకోవచ్చు.
నాగబాబును మండలికి పంపించి, అట్నుంటి అటు మంత్రిని చేసి, కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో తీర్మానం చేసి మీడియాకు సమాచారం కూడా ఇచ్చారు.
