
మహిళలకు ఫ్రీ బస్ అంటేనే మన తెలుగు రాష్ట్రాల్లో బస్సులు కిక్కిరిసి పోతున్న పరిస్థితి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటూ మన పక్క రాష్ట్రం తన రానున్న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీని చేర్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటనతో ప్రజారవాణాపై ప్రభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని AIADMK తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రజలను ఆకట్టుకునేలా సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత, ఉపాధి, గృహ నిర్మాణం వంటి అంశాలకు పెద్దపీట వేసింది.
ముఖ్యంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రతి మహిళకు నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే, ఇప్పటికే మహిళలకు అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరించి, సిటీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ఇది మేనిఫెస్టోలో కీలక ఆకర్షణగా నిలిచింది.
అదే విధంగా, ‘అమ్మ టూ వీలర్ స్కీమ్’ కింద 5 లక్షల మందికి ద్విచక్ర వాహనాలపై రూ.25,000 సబ్సిడీ అందిస్తామని ఏఐడీఎంకే హామీ ఇచ్చింది. దీని ద్వారా ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు చేసే వారికి ప్రయోజనం చేకూరనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్న పేదలకు కాంక్రీట్ ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రస్తుతం ఉన్న 100 రోజుల పనిని 150 రోజులకు పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
మొత్తంగా చూస్తే, Tamil Naduలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా, సంక్షేమం మరియు అభివృద్ధిని సమన్వయంగా ముందుకు తీసుకెళ్లే హామీలతో ఏఐడీఎంకే మేనిఫెస్టో విడుదలైంది. రానున్న ఎన్నికల్లో ఈ హామీలు ఎంత మేర ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
