
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజీత్ దీప్కే మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ఉద్యమం ప్రధాని రాజీనామా వరకు వెళ్లే అవకాశముందని హెచ్చరించారు.
గురువారం మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే.. “మోదీ జీ.. మిమ్మల్ని మరోసారి అభ్యర్థిస్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను వెంటనే ఆమోదించండి. లేకపోతే ఇది ఆయనతో ఆగదు.. మీ రాజీనామా వరకు కూడా వెళ్లే పరిస్థితి వస్తుంది” అని వ్యాఖ్యానించారు.
ధర్మేంద్ర ప్రధాన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎందుకు అండగా నిలుస్తోందని ప్రశ్నించిన ఆయన.. “దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే ఒక అసమర్థ మంత్రి ముఖ్యమా? ఒకవేళ మంత్రి ముఖ్యమని భావిస్తే ప్రజలు మీకు మద్దతు ఇవ్వబోరన్న విషయాన్ని గుర్తుంచుకోండి” అని అన్నారు.
ఇటీవల నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆహ్వానించినప్పటికీ, సీజేపీ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఎలాంటి చర్చైనా జంతర్ మంతర్ వద్ద లేదా పూర్తిగా తటస్థ వేదికపై నిర్వహించాలని పార్టీ స్పష్టం చేసింది.
అలాగే, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని మోదీ ప్రకటనపై కూడా అభిజీత్ దీప్కే స్పందించారు. ఇలాంటి ప్రకటనలతో సమస్యకు పరిష్కారం కాదని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక్కటే తమ ప్రధాన డిమాండ్ అని మరోసారి స్పష్టం చేశారు.
