Download App

గందరగోళంలో విజయ్ ప్రమాణ స్వీకారం…

మే 7, 2026 By Suresh Thota
తమిళనాడు రాజకీయ చరిత్రలో గత ఆరు దశాబ్దాలుగా చూడని ఒక విలక్షణమైన పరిస్థితి నేడు నెలకొంది. ద్రావిడ సిద్ధాంతాల పునాదులపై నిర్మించబడిన కోటలు బీటలు వారుతున్నాయి. "విజయ్" నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు...
గందరగోళంలో విజయ్ ప్రమాణ స్వీకారం…

తమిళనాడు రాజకీయ చరిత్రలో గత ఆరు దశాబ్దాలుగా చూడని ఒక విలక్షణమైన పరిస్థితి నేడు నెలకొంది. ద్రావిడ సిద్ధాంతాల పునాదులపై నిర్మించబడిన కోటలు బీటలు వారుతున్నాయి. “విజయ్” నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఆ పది అడుగుల దూరం (మ్యాజిక్ ఫిగర్ 118) ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఉత్కంఠ కు గురి చేస్తుంది.

ప్రస్తుతం అందరి కళ్లు “AIADMK” పైనే ఉన్నాయి. “డీఎంకే” (DMK) ని అధికారానికి దూరం చేయాలనే లక్ష్యం తో “ఏఐఏడీఎంకే” లో ఇప్పుడు రెండు భిన్నమైన ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పార్టీ ఉనికి ముఖ్యం అని భావించే అధినేత “ఎడప్పాడి పళనిస్వామి” (EPS) వర్గం, విజయ్‌కు మద్దతు ఇస్తే భవిష్యత్తులో “ఏఐఏడీఎంకే” ఓటు బ్యాంకును ఆయనే హస్తగతం చేసుకుంటారని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరొక వర్గం సుమారు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

“డీఎంకే”ను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారానికి చేరువ కానీయకూడదు అంటే, తామే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్ల పార్టీని బలోపేతం చేసుకోవచ్చని, తద్వారా “డీఎంకే” ను పూర్తిగా కోలుకోకుండా చేయవచ్చు…..అని, వీరి వాదన. ఒకవేళ అధిష్టానం మొండిగా వ్యవహరిస్తే, ఈ 30 మంది ఎమ్మెల్యేలు విడిపోయి విజయ్‌కు మద్దతు పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే తమిళనాడులో “ఏఐఏడీఎంకే” చరిత్రాత్మక చీలికను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరో వైపు కాంగ్రెస్ షరతుల తో కూడిన మద్దతు అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో దశాబ్దాల నాటి డీఎంకే-కాంగ్రెస్ బంధం తెగిపోయింది. ఏఐసిసి ప్రతినిధి “గిరీష్ చోడంకర్” ద్వారా కాంగ్రెస్ తన మద్దతును విజయ్‌కు ప్రకటించింది. అయితే, ఇక్కడే ఒక మెలిక ఉంది. “మతతత్వ శక్తులు కూటమిలో ఉండకూడదు” అనే కాంగ్రెస్ షరతు, బీజేపీతో పొత్తులో ఉన్న “ఏఐఏడీఎంకే”ను ఇబ్బంది పెడుతోంది. అటు “కాంగ్రెస్‌”ను, ఇటు “ఏఐఏడీఎంకే” అసమ్మతి వర్గాన్ని కలుపుకుని వెళ్లడం విజయ్‌కు కత్తిమీద సాము లాంటిదే.

సాధారణంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఇప్పుడు ఎందుకు “మీన మేషాలు” లెక్కిస్తున్నారని TVK కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు. “విజయ్” దగ్గర స్పష్టమైన మెజారిటీ కి సంబంధించిన జాబితా (118 పత్రాలు) ఇంకా సిద్ధం కాలేదు. “కాంగ్రెస్” మద్దతు పత్రం అందినప్పటికీ, “ఏఐఏడీఎంకే” చీలికపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని రాజ్‌భవన్ భావిస్తోంది అని ఒక వర్గం అంచనా వేస్తుంది. పూర్తిగా మెజారిటీ పత్రాలు లేకుండా, విజయ్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తే….. తర్వాత ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉండటమే గవర్నర్ ఆలస్యానికి ప్రధాన కారణంగా, తెలుస్తుంది.

“స్టాలిన్” ఓటమినీ DMK నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో తమిళ సూపర్ స్టార్ “రజనీకాంత్” స్టాలిన్ ను కలిశారు. ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం డీఎంకే శ్రేణులను కుంగదీసింది. ఈ తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనను కలవడం వెనుక సానుభూతి తప్ప మరొకటి లేదని, వారిద్దరి మధ్య కరుణానిధి నాటి నుండి దశాబ్దాల స్నేహం ఉంది కనుక కలిశారు అని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు.

ముగింపు: తమిళనాడు ఇప్పుడు ఒక చారిత్రక సంధి కాలంలో ఉంది. “విజయ్” ప్రమాణ స్వీకార కార్యక్రమం నిజంగానే గందరగోళంలో పడింది. ఈ సంధికాలం విజయ్ భవిష్యత్తునే కాకుండా, రాష్ట్రంలోని సంప్రదాయ పార్టీల భవిష్యత్తును కూడా నిర్ణయించబోతోంది. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల నిర్ణయం ఈ “రాజకీయ చదరంగం”లో ఎవరిని అధికార పీఠం మీద కూర్చోబెడుతుంది అనేది రేపటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading