
రాజకీయ నాయకులకి విశాల దృక్పథం ఉండాలి. ఉదా : అటల్ బిహారీ వాజపేయి… మంచి కవి, గొప్ప వక్త… ప్రతి పక్ష సభ్యులు కూడా, ఆయన ప్రసంగానికి లేచి చప్పట్లు కొట్టి అభినందించేవారు. నాయకులు అంటే అలా ఉండాలి. అంతేగాని కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టీ చలి కాచుకునే వాళ్ళు నాయకులు కాజాలరు. రాజకీయంగా ఎదగాలి అనుకోవడం తప్పు కాదు, విద్వేష ప్రసంగాలు చేసి అమాయక ప్రజల, ధన, మాన, ప్రాణాలతో ఎదగాలి అనుకోవడం తప్పు. ఒకసారి ద్వేష భావం తలకు ఎక్కిన తరువాత మనిషిలో, వికృత భావం రకరకాలుగా బయటకు వస్తుంది. నాయకత్వం కోసం పోరాడు తప్పులేదు. అందరూ ఈయన చెబుతుంది నిజమే కదా అన్నట్టుగా, వైరి వర్గాలు కూడా హర్షించేట్టుగా ఉండాలి.
భారత దేశం ఎన్నో సంవత్సరాల పాటు, విదేశీయుల దండయాత్రలతో మగ్గిపోయింది. వందల సంవత్సరాలు ముస్లిమ్ రాజుల, డచ్, బ్రిటిష్, ఇలా చాలా మంది మనల్ని, దోచుకుని మన సొమ్ము తరలించుకుపోయారు. ఎక్కడికి తమ, తమ దేశాలకి… అంటే వాళ్ళ దేశ అభివృద్ధికి, వాళ్ళ దేశ ప్రజల ప్రగతికి, అంటే వాళ్ళ ప్రజలని అభివృద్ధి నిమిత్తం చేశారు వాళ్ళు.
ఇది అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే… తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు “కల్వకుంట్ల కవిత” మొన్న ఒక సందర్భంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు.
“ట్యాంక్ బండ్లో ఆంధ్రా వాళ్ళ విగ్రహాలు తీసెయ్యాలని నేను చెప్పను కానీ… సమయం వచ్చినప్పుడు ఆ పని చేయొచ్చు. అక్కడ తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు పెట్టాలి.”
సమయం వచ్చినప్పుడు ఆ పని చేయవచ్చు అంటే అర్ధం ఏమిటి… మీకు ఆ అవకాశాన్ని మీకు అనుకూలంగా మార్చుకునే సమయం వచ్చినప్పుడు… మీరు ఉపయోగించుకుంటారనే కదా అర్ధం.
ఎప్పుడూ “కోట తలుపులు లోపలి నుండే తెరవబడ్డాయి” ఇది మీకు తెలుసు, అయినా సరే మీరు గద్దె మీద కూర్చోవడం కోసం ఏమైనా చేసేలా ఉన్నారు… కశ్మీర్ లో ఉగ్రవాద, భారత వ్యతిరేక శక్తులు హిందువులను కాశ్మీర్ వదిలి వెళ్ళిపోండి… మీ ఆనవాళ్లు ఇక్కడ ఉండొద్దు అని మసీదులో మైకులు పెట్టీ హెచ్చరించినట్టుగా ఉంది మీ పోకడ… అంత విద్వేషం ఎక్కించారు ప్రజల మస్తిష్కంలోకి… పది సంవత్సరాల మీ ఏలుబడిలో ఏమి చేశారు…
ఆంధ్రా నాయకుల విగ్రహాలు అప్పుడే తీసేయలేకపోయారా…? మీకు ప్రజలను మభ్యపెట్టడానికి ఇటువంటి ఆనవాళ్లు ఉంచి ప్రతిరోజూ వీటి మీద మాట్లాడి అమాయక ప్రజల నుండి వచ్చే భావోద్వేగాలను ఓట్ల రూపంలో మరల్చుకోవడానికి, ఒక అవకాశం గా ఉంచుకున్నారా…? నిజంగా దేశాన్ని ఐక్యతగా ఉంచాలి అనే కోణం మీలో ఎక్కడా గోచరించడం లేదు. ప్రతి అవకాశాన్ని మీ రాజకీయ ఎదుగుదలకు అవకాశంగా మార్చుకోవాలనే తత్వం తప్ప.
ఇక విగ్రహాల విషయానికి వస్తే మహారాష్ట్ర వ్యక్తి అని… “అంబేద్కర్”ను, బీహార్ వ్యక్తి అని “బాబు జగ్జీవన్ రామ్” ను టచ్ చేయగలరా… లేకపోతే 2014కు ముందు ఆంధ్రా ప్రాంత సీఎం లు టైమ్ లో వచ్చిన సంస్థలు అన్ని ఇక్కడ నుండి వెళ్లిపోవాలని పిలుపు నిస్తారా… అసలు సభ్య సమాజానికి ఏమి సందేశం ఇవ్వదలిచారు.
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ నాయకులు బుద్ధుని విగ్రహాలను బాంబులతో నాశనం చేశారు. టూరిజం ఎంత నాశనం అయిపోయింది. ఇప్పుడు మన దేశ సాయంతో ముందుకు సాగుతున్నారు.
ప్రజలు అమాయకులు, నాయకులే విచక్షణతో ఆలోచించి ముందుకు సాగాలి. మీ మాటలు చూస్తుంటే రాబోయే రోజుల్లో…. ఆంధ్రా వాళ్ళ విగ్రహాలు తీసి రజాకార్ల నాయకుడు “ఖాసిం రజ్వీ” విగ్రహం పెట్టడానికి కూడా సాహసించేలా ఉన్నారు, అని సోషల్ మీడియాలో ఒక నెటిజనుడు చమత్కరించాడు.
అల్లూరి సీతారామరాజు జాతీయ నాయకుడా… ఆంధ్రా నాయకుడా… టంగుటూరి ప్రకాశం పంతులు జాతీయ నాయకుడా… ఆంధ్రా నాయకుడా… జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య… జాతీయ నాయకుడా…. ఆంధ్రా నాయకుడా…. ప్రముఖ కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు అయిన త్యాగయ్య కీర్తనలు తెలంగాణలో వినబడకూడదా… తెలుగు వారి కంటే తమిళులు నెత్తినపెట్టుకున్నారు…. ఇప్పుడు వాళ్ళు గొప్పనా… మీరు గొప్పనా… వేమన పద్యాలు తెలంగాణలో ఉండకూడదా… వాటిని ప్రోది చేసి మనకు అందించిన CP బ్రౌన్ ముందు మన బుద్ధి ఏ పాటిది… తాగు, సాగునీటిని అందించిన సర్ ఆర్థర్ కాటన్ ముందు మన సంకుచిత బుద్ధి ఏ పాటిది… ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు.
సాగితే అన్నమయ్య కీర్తనలు తెలంగాణ వాళ్ళు తిరుపతి స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు మాకు వినపడకూడదు అనేట్టుగా ఉన్నారు… అని సోషల్ మీడియా లో ఒకరు వ్యాఖ్యానించారు.
మీరు విడిపోయింది ఒక రాష్ట్రం నుండే కాని, దేశం నుండి కాదు కవితక్క మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు… రాజకీయంగా ఎదగాలి అంటే ఇకనైనా సంకుచిత మనస్తత్వంతో కాక, విశాల దృక్పథం ఉండాలి అని కొందరు రాజకీయ విశ్లేషకులు ఉచిత సలహాలు ఇస్తున్నారు.
