
పళని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సేవలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం పాల్గొన్నారు. దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా షష్ట షణ్ముఖ క్షేత్రాల పర్యటనలో పళనిలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి దర్శనానికి వచ్చారు పవన్.
రోప్ వే ద్వారా ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి, అర్ములిగు దండాయుధపాణి స్వామి వారి క్షేత్రంలో పూజలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి క్షేత్రాన్ని దర్శించారు.
పళనిలో అత్యంత ముఖ్యమైన పండుగ థాయ్-పూసం. తమిళ థాయ్ నెల (జనవరి 15-ఫిబ్రవరి 15) పౌర్ణమి రోజున ఈ పండగను జరుపుకుంటారు. అలాంటి పౌర్ణమి రోజుల్లోనే పవన్ కళ్యాణ్, మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.

పూజల అనంతరం ఉప-ముఖ్యమంత్రికి ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండుద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిర్దం అందించారు. అనంతరం ఆలయ ఆవరణలోనే ఉన్న శివాలయంలో పూజలు చేశారు పవన్.
స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన పవన్.. పళని సుబ్రమణ్య స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సౌకర్యాలు కల్పించడం పై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు.
