
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్ బీసీ) టన్నెల్ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని పలు ప్రశ్నలు సంధించారు జూపల్లి. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఅర్ఎస్ పార్టీ, ఎందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పెండింగ్ లో పెట్టిందని ప్రశ్నించారు. టన్నెల్ ను 200 మీటర్లు తవ్వి ఎందుకు వదిలేశారు..? తక్కువ లాభం వస్తుందనా? లేక కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు జూపల్లి.
అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పక్కనపెట్టిన బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి. ఇకనైనా ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మానుకోవాలని సూచించారు.
జరిగిన ఘటనపై స్పందించిన జూపల్లి, టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది బతికే అవకాశం లేదని తేల్చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. మరో 48 గంటల్లో పూర్తి స్పష్టత వస్తుందని ప్రకటించారు.
