
ఉత్తరాంధ్ర వ్యాపారవేత్త గేదెల శ్రీనుబాబు తమను మోసం చేశారని ఆరోపిస్తున్నారు పల్సస్ సంస్థ ఉద్యోగులు. గత 4-5 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
జీతాలు చెల్లించేందుకు 3 రోజులు గడువు కోరిన యాజమాన్యం, ఈ గ్యాప్ లో పత్తా లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు. మరోవైపు పల్సస్ ఐటీ కంపెనీ ఉద్యోగులకు పిఎఫ్ విషయంలో కూడా కంపెనీ శఠగోపం పెట్టినట్టు తెలుస్తోంది.
ఎంప్లాయిస్ పీఎఫ్ మొత్తాన్ని పల్సస్ కంపెనీ ఇంకా చెల్లించలేదు. దీంతో పల్సస్ పీఎఫ్ అకౌంట్ ను ఫ్రీజ్ చేశారు పీఎఫ్ కమిషనర్. ఈ మేరకు ఉద్యోగుల పీఎస్ ఎకౌంట్లను కూడా బ్లాక్ లో పెట్టి, కంపెనీకి నోటీసులిచ్చారు. దీంతో ఐటీ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
తనకుతాను ప్రచారం చేసుకోవడంలో శ్రీనుబాబు దిట్ట. దీనికోసం ఆయన దగ్గర ప్రత్యేకంగా ఓ పీఆర్ టీమ్ పనిచేస్తుంది. అలా తననుతాను విద్యావేత్తగా ప్రొజెక్ట్ చేసుకున్న శ్రీనుబాబు.. మొదట జనసేనలో చేరారు. ఆ తర్వాత వైసీపీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు టీడీపీలో టికెట్ కోసం ప్రయత్నించినట్టు కొంతమంది చెబుతారు. నిజానికి పల్సస్ అనే కంపెనీ కూడా పూర్తిస్థాయి ఐటీ కంపెనీ కాదంటారు చాలామంది.
