
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల్ని విడుదల చేసింది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించింది. ఈ మేరకు రాష్ట్రంలో 17 లక్షల మందికి పైగా రైతులకు లబ్ది చేకూరింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతగా జనవరి 27న కొంతమందికి నిధులు జమ అయ్యాయి. రెండో విడతగా ఇప్పుడు మరికొంతమంది రైతులకు లబ్ది చేకూరింది.
అత్యథికంగా నల్గొండ జిల్లాలో లక్షా 55వేల మంది రైతులకు రైతు భరోసా నిధులు పడ్డాయి. ఆ తర్వాత స్థానంలో సిద్ధిపేట ఉంది. ఇప్పటివరకు 21 లక్షల 45వేల మందికి 1126 కోట్ల రూపాయల నిధుల్ని జమ చేసినట్టు మంత్రి తుమ్మల ప్రకటించారు.
మరోవైపు రైతు భరోసా పథకంపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. రైతు భరోసా కింద గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తప్పుబట్టారు. రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులుంటే, కేవలం 21 లక్షల మందికి సాయం చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
