
గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరిట మొత్తం నాశనం చేసిందని, అలా వాళ్లు సాధించేదేమీ లేదని అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకు సంబంధించి రివర్స్ టెండర్ విధానం లేకుండానే వెయ్యి కోట్ల రూపాయలు ఆదా చేశామన్నారు.
“పాఠశాల విద్యార్థులకు ఇచ్చే గుడ్లు, చిక్కీ, స్కూల్ కిట్ లో రివర్స్ టెండరింగ్ లేకుండానే వెయ్యి కోట్లు ఆదా చేశాం. గత ప్రభుత్వం ఇదే పేరు చెప్పి నాసిరకం ఉత్పత్తులు అందించింది. పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంది.”
వచ్చే విద్యా సంవత్సరం నాటికి స్కూల్ బ్యాగ్, యూనిఫాం నాణ్యత కూడా పెంచుతామని హామీ ఇచ్చారు మంత్రి. ఇక పారిశ్రామిక విధానానికి సంబంధించి, గత ప్రభుత్వంలో ఉన్నట్టు లంచాలు ఉండవని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ హయాంలో పారిశ్రామిక రాయితీలు ఇవ్వడానికి కూడా 50శాతం లంచం అడిగారని, ఢిల్లీలో ఓ పారిశ్రామికవేత్త తనకు ఈ విషయం చెప్పారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో లంచాలకు తావులేకుండా, పారదర్శకంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామన్నారు.
